శబరిమల బంగారం చోరీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Sabarimala gold theft Case Unnikrishnan Potty gets bail | Sakshi
Sakshi News home page

శబరిమల బంగారం చోరీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Feb 5 2026 3:07 PM | Updated on Feb 5 2026 3:27 PM

Sabarimala gold theft Case Unnikrishnan Potty gets bail

తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో ఈ బెయిల్ లభించింది. దీంతో, అతడి బెయిల్‌ అంశం చర్చనీయాంశంగా మారింది.

కాగా, శబరిమలలో శ్రీకోవిల్ (గర్భగుడి) తలుపుల ఫ్రేముల నుండి బంగారం అదృశ్యం కావడానికి సంబంధించిన రెండో కేసులో ఉన్నికృష్ణన్‌ పొట్టికి బెయిల్ మంజూరైంది. అంతకంటే ముందు.. సంబంధిత ద్వారపాలక విగ్రహం కేసులో కూడా అతనికి బెయిల్ లభించింది. కొల్లాంలోని విజిలెన్స్ కోర్టు గురువారం అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. ఫలితంగా శబరిమల బంగారం చోరికి సంబంధించిన రెండు ప్రధాన కేసులలో ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. కేరళ విడిచి వెళ్లకూడదు. శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. అతను ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలి.

ఇదిలా ఉండగా, ఉన్నికృష్ణన్‌కు బెయిల్ మంజూరు కావడం కేరళలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ ‍స్పందిస్తూ.. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై పదేపదే ఆరోపణలు చేశాం. సిట్‌ కేసును తప్పుదోవ పట్టించే విధంగా దర్యాప్తు పద్ధతిని అనుసరిస్తోందని ముందే చెప్పాం. పలుమార్లు హెచ్చరించాం. మా ఆరోపణ ఇప్పుడు నిజమైంది. వారందరికీ బెయిల్ వస్తుందని మేము చెప్పాం. సరిగ్గా అదే జరుగుతోంది. వారు కనీసం ప్రాథమిక చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు అని మండిపడ్డారు. ఇప్పుడు సీపీఐ(ఎం) నాయకులు జైలు నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. మాజీ దేవస్వం మంత్రి, ప్రస్తుత దేవస్వం మంత్రి సహా చాలా మంది ఇప్పటికే క్యూలో ఉన్నారు. వారిని అరెస్టు చేయాలి. మేము ఇప్పటికే మంత్రి రాజీనామాను డిమాండ్‌ చేశాం అని వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement