టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు.
6 బంతులు ఎదుర్కొన్న శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో జాకబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
తిలక్ వర్మ పునరాగమనం చేస్తే తుది జట్టులో సంజూ స్ధానం గల్లంతే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ.. త్వరలోనే జట్టులో చేరనున్నాడు. తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్‌లో ఎవరో బెంచ్‌కే పరిమితమవ్వాలి.
అయితే ఇషాన్ తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. శాంసన్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా కూడా కిషన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. ఇషాన్ కిషన్.. అభిషేక్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది.
అంతకుముందు శుభ్‌మన్ గిల్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆసియాకప్, సౌతాఫ్రికా సిరీస్‌లో ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్‌ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్‌ను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఉపయోగించుకోలేకపోయాడు.


