సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌తో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి శశి థరూర్ చెక్ పెట్టారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సుమారు 90 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర వ్యక్తిగత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా పార్టీతో తన అనుబంధం బలంగా ఉందని, విభేదాల ఊహాగానాలకు తావు లేదని థరూర్ స్పష్టంచేశారు.
శశి థరూర్ ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను సమర్ధించినట్లు చెప్పారు.ఆ తర్వాత పలు పత్రికల్లోని గెస్టు కాలమ్స్‌లో ఆపరేషన్ సిందూర్‌ను కీర్తించారు.దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో విభేదాలు మరింత పెరిగాయని, ముఖ్యంగా కేరళ యూనిట్‌లో అసమ్మతి ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాహుల్, ఖర్గేలను కలవడం ద్వారా పార్టీ లోపల ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.
సమావేశం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ భేటీని సానుకూలంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలు థరూర్‌తో చర్చలు జరిపి, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం అత్యవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా కేరళలలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు ఒకే దిశగా కదలాలని ఈ సమావేశం సంకేతం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


