ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు | TN Minister Sparks Fresh Language Row | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 5 2026 12:51 PM | Updated on Feb 5 2026 12:58 PM

TN Minister Sparks Fresh Language Row

చెన్నై: తమిళనాట మరోమారు భాషా వివాదం రాజుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం భాషా వివాదాన్ని తట్టి లేపారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు  చర్చనీయాంశమయ్యాయి.

ఉత్తరాది వారికి కేవలం హిందీ మాత్రమే తెలియడం వల్ల వారికి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, అందుకే వారు తమిళనాడుకు వచ్చి టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో పని చేయడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి పనులు చేసుకుంటున్నారని పన్నీర్‌సెల్వం  వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విభాషా విధానంతో కలిగే ప్రయోజనాలను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లండన్, అమెరికా తదితర దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా స్పందిస్తూ రాష్ట్రంలో హిందీ మాట్లాడటాన్ని ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని, జర్మన్, జపనీస్ వంటి విదేశీయులే ఇక్కడ సంతోషంగా ఉంటున్నప్పుడు, హిందీ మిత్రులకు ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘భాష’ ప్రధానాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి దీనిని సవాలు చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1930లు, 1960ల కాలంలో జరిగిన భాషా ఉద్యమాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. 

ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement