పరమేశ్వరుడి ప్రతిరూపం అరుణాచలం.. అక్కడి పర్వతమే పరమాత్మగా ప్రాభవం పొందిన అరుణగిరిని దర్శించుకోవటం పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే, ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉన్న విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు 14 కి.మీ దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అక్కడ మరింత రద్దీగా ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొండ ఎక్కడానికి అటవీశాఖ వారు నిషేధం విధించారు. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా నటి అర్చనా రవిచంద్రన్‌తో పాటు నటుడు అరుణ్ వెళ్లారు. అక్కడ వారిద్దరూ ఫోటోలను కూడా తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

వాటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇద్దరికి రూ. 5వేలు చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అన్నామలై (అరుణాచల) కొండపైకి భక్తులు ఎక్కకూడదనడానికి ప్రధాన కారణం ఉంది. ఆ కొండను స్వయంగా శివుడి రూపంగా పరిగణించడం వల్ల ఎవరూ కొండపైకి వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కొండపైకి నేరుగా ఎక్కడం అపచారం. పవిత్రతకు విరుద్ధం అని భక్తులు భావిస్తారు. ఈ కొండను దేవాలయ గోపురంలా కాకుండా.. దేవుడి శరీరంగా భక్తులు భావిస్తారు. కాబట్టి దానిపై నడవడం, ఎక్కడం అనేది శివుని శరీరంపై నడిచినట్లుగా అవుతుంది.


