ముంబై: మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై 33 గంటలుగా కొనసాగుతున్న భారీ ట్రాఫిక్ జామ్ ఎట్టకేలకు గురువారం ఉదయం క్లియర్ అయ్యింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్‌లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారుజామున 1:46 గంటల ప్రాంతంలో ఆదోషి టన్నెల్ సమీపంలో ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ను తొలగించడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతివేగంతో వస్తున్న ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన, మండే స్వభావం గల గ్యాస్ కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వెంటనే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బుధవారం రోజంతా ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. హెవీ డ్యూటీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను రోడ్డుపై నుండి తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ అయిందని మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌డీసీ) అధికారులు వెల్లడించారు.
సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆహారం, తాగునీరు తదితర సదుపాయాలు లేక గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. కొందరు పారిశ్రామికవేత్తలు ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు హెలికాప్టర్లను ఆశ్రయించగా, సామాన్య ప్రయాణికులు మాత్రం ఎముకలు కొరికే చలిలో రోడ్డుపైనే కాలం గడపాల్సి వచ్చింది.
ఈ భారీ ట్రాఫిక్ అంతరాయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఘాట్ సెక్షన్‌లో వాహనాల రద్దీ నెమ్మదిగా సర్దుకుంటోందని హైవే పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఘజియాబాద్ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి


