7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన | PM Modi to visit Malaysia on February 7-8 | Sakshi
Sakshi News home page

7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన

Feb 5 2026 8:31 AM | Updated on Feb 5 2026 8:46 AM

PM Modi to visit Malaysia on February 7-8

న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ​్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024, ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అన్వర్ ఇబ్రహీంలు భారత్-మలేషియా సంబంధాలలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ‘10వ భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్’ కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మైత్రిని మరింత పటిష్టం చేయడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశం. భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘమైన చారిత్రక, నాగరికత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement