ఈ తరం పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఆ ఫోనులో కనిపించే సమస్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలుగా మారడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ‘కొరియన్ లవర్’ అనే ఆన్‌లైన్ గేమ్ మాయలో పడి భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. చిన్నారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి ప్రాణాలతో ఆటలాడుతున్న డేంజరస్ గేమ్‌లు ఇవే..
కొరియన్ లవర్
ప్రస్తుతం అత్యంత వేగంగా పిల్లలను ఆకట్టుకుంటున్న ప్రమాదకరమైన గేమ్ ఇది. ఇందులో అందమైన కొరియన్ బొమ్మలు, యానిమేషన్ పాత్రల సాయంతో పిల్లలను ఆకట్టుకుంటారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి, చివరకు ఆత్మహత్య చేసుకుంటేనే ‘నిజమైన ప్రేమ’ దక్కుతుందని లేదా ‘మరో ప్రపంచానికి’ వెళ్తారని నమ్మిస్తారు. ఘజియాబాద్ చిన్నారులు సరిగ్గా ఈ ఉచ్చులోనే పడి ప్రాణాలు వదిలారు.
బ్లూ వేల్ అండ్ మోమో ఛాలెంజ్
గతంలో వందలాది ప్రాణాలు తీసిన బ్లూ వేల్ గేమ్ ఇప్పుడు సరికొత్త లింకుల రూపంలో వాట్సాప్, టెలిగ్రామ్‌లలో తిరుగుతోంది. చేతిపై గాట్లు పెట్టుకోవడం, అర్ధరాత్రి భయంకరమైన సినిమాలు చూడటం వంటి 50 టాస్క్‌లు ఇందులో ఉంటాయి. చివరి టాస్క్ ‘చనిపోవడం’. మోమో ఛాలెంజ్ కూడా వింత ఆకృతి గల బొమ్మతో పిల్లలను భయపెట్టి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది.

క్రోమింగ్ ఛాలెంజ్
ఇది గేమ్‌ల కంటే ప్రమాదకరమైన సోషల్ మీడియా ట్రెండ్. ఇంట్లోని నెయిల్ పాలిష్ రిమూవర్స్, హెయిర్ స్ప్రేలు, పెయింట్ థిన్నర్స్ వంటి రసాయనాలను ముక్కు ద్వారా పీల్చడమే ఈ ఛాలెంజ్. దీనివల్ల క్షణాల్లో మెదడు మొద్దుబారిపోతుంది. ఇది శాశ్వత మెదడు వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటుకు దారితీస్తోంది.
ఫైర్ ఫెయిరీ
ఇది చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన గేమ్. దీనిలో వారిని ఒక ‘అగ్ని దేవత’గా మారుస్తానని నమ్మిస్తుంది. అర్థరాత్రి గ్యాస్ స్టవ్ వెలిగించి, దాని చుట్టూ తిరగాలని లేదా గ్యాస్ ఆన్ చేసి పడుకోవాలంటూ వింత టాస్క్‌లు ఇస్తుంది. దీనివల్ల ఇల్లు తగలబడటమే కాకుండా, ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
బ్లాక్ అవుట్ అండ్ బెనాడ్రిల్ ఛాలెంజ్
పిల్లలు తమ మెడను తామే బిగించుకుని, ఊపిరి ఆడక స్పృహ కోల్పోయే వరకు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయడమే ఈ ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్. అలాగే, అధిక మోతాదులో దగ్గు మందులు తాగి వింత భ్రమలకు గురికావడం మరో మృత్యు క్రీడ. ఇవి నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీసి, ప్రాణాపాయం కలిగిస్తాయి.
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీ పిల్లల ఫోన్‌ను మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండి. మీ పిల్లలు యూట్యూబ్‌లో, బ్రౌజర్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచుగా గమనించండి. 
రోబ్లాక్స్ (Roblox) వంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు అందులో అపరిచితులతో మాట్లాడకుండా ‘చాట్ ఆప్షన్’ను డిసేబుల్ చేయండి. టెక్నాలజీ ఎంత పెరిగినా, తల్లిదండ్రుల పర్యవేక్షణే పిల్లలకు అసలైన రక్షణ అని గుర్తించండి.
ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి గూగుల్ షాక్.. ‘జెమిని’లోకి పాత చాట్స్


