సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. కరీంనగర్ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణా ఐపీఎస్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా కౌశిక్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
‘‘కరీంనగర్ సీపీపై మత మార్పిడి ఆరోపణలు నేను చేయలేదు. నేను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రివిలేజ్ మోషన్ వేస్తా’’ అంటూ కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
కాగా, పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సీపీ గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారంటూ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కరీంనగర్ సీపీ గురించి కౌశిక్‌రెడ్డి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.


