ఈ లక్ష్య సాధన కోసం మా పాలన కొనసాగుతుంది
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి
22న రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని రైతు నామ సంవత్సరంగా మారుస్తామని వెల్లడించారు. గురువారం రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయాధారితంగానే మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా వ్యవసాయరంగ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేశామని.. రూ. 18 వేల కోట్లను రైతు భరోసా కోసం ఖర్చు చేశామని వివరించారు.
ఈ నెల 22న మరో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. గతంలో రైతులను వేధించిన ధరణి భూతాన్ని పారదోలి భూభారతితో భూ సమస్యలు పరిష్కరించామని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది కొత్త పంచాంగాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పండితులు వేదాశీర్వాదం అందించారు. అనంతరం వేద పండితులు, ఆలయాల్లో సేవలందిస్తున్న కళాకారులను సన్మానించారు.
ఈసారి మంచి వర్షాలే..
పరాభవ నామ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండి మంచి వానలు కురుస్తాయని.. ఫలితంగా తెలంగాణ వ్యవసాయ తల్లిగా ధాన్యాగారంగా మారుతుందని పౌరాణికులు, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి పేర్కొన్నారు. శ్రీ పరాభవ ఉగాది వేడుకల్లో ఆయన ప్రభుత్వపక్షాన పరాభవ నామ పంచాంగాన్ని చదివి గోచార వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆరోగ్య శాఖలో అద్భుత ప్రక్షాళన జరుగుతుందని.. ప్రజారోగ్యానికి సంబంధించిన చర్యలు, మెరుగైన వైద్య వసతి కల్పించడంలో సానుకూలత ఉంటుందన్నారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల పరంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అవలంభించకుంటే ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదొడుకులు తప్పవన్నారు. ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని.. రాష్ట్రానికి ఖర్చులు బాగా పెరుగుతాయని పేర్కొన్నారు. పరిపాలనలో రాజుకు, మంత్రులకు మధ్య ఆధిపత్యాలను కోరుకొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
అయితే ధర్మంగా ఉండేవారికి మాత్రం ఈ ఆధిపత్యంలోనూ విజయం లభిస్తుందని వివరించారు. తులారాశిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులే ఉన్నాయని.. నడుస్తున్న దశా బలం, గోచార బలం, సమర్థత, వబలం వల్ల సవాళ్లను అధిగమించి తిరుగులేని ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని సంతోషకుమార్ శాస్త్రి చెప్పారు.


