దేశంలోని మెట్రో నగరాల ప్రజల్లో నిద్రలేమి సమస్యలు
తాజా అధ్యయనంలో వెల్లడి
క్రమశిక్షణగల నిద్రలో చెన్నై తొలిస్థానం.. చిట్టచివరన నిలిచిన ముంబై
బ్యాలెన్స్‌డ్ స్లీపర్ సిటీగా నిలిచిన హైదరాబాద్
భాగ్యనగరంలో ఆలస్యంగా నిద్రిస్తున్న వారు 42 శాతంగా నమోదు
సాక్షి, హైదరాబాద్: మనిషి ఆరోగ్యకర జీవనానికి తగినంత నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మెట్రో నగరాల ప్రజలను మాత్రం నిద్రాదేవత తగినంత కరుణించట్లేదు. వేక్‌ఫిట్ డాట్ కామ్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిద్రవేళల్లో క్రమశిక్షణ, నిద్రలేమి, నిద్రలేచే సమయాలు, పగటిపూట అలసట వంటి కీలక నిద్ర సూచికల ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా ఆయా నగరాలకు ర్యాంకులు ప్రకటిస్తూ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ పేరిట నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది.
నిద్ర ఆధారంగా నగరాలకు ఇచ్చిన ర్యాంకులు ఇవే...
» దేశంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నిద్ర అందుకుంటున్న నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోవడం (48.8%) ఆలస్యంగా నిద్రలేవడం (23.8%) అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 32.1% మంది నిద్రలేమి బాధితులున్నారు. అయితే గణనీయమైన సంఖ్యలో (61.9%) విశ్రాంతి పొందకుండానే నిద్రలేస్తున్నట్లు చెబుతున్నారు.
» స్థిరమైన నిద్ర అలవాట్లను ప్రతిబింబిస్తూ హైదరాబాద్ ’బ్యాలెన్స్‌డ్ స్లీప్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా 31 శాతం మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మెరుగైన సమతౌల్యమైన నిద్రా విధానాన్ని సూచిస్తుంది.
» గురుగ్రామ్ మూడో స్థానంలో నిలిచి ‘రెసిలియంట్ స్లీపర్ సిటీ’గా పేరు పొందింది. ఇక్కడి యువ ఉద్యోగులు తమ బిజీ షెడ్యూళ్లను నిర్వహిస్తూనే ఆరోగ్యకరమైన నిద్రా విధానాలను పాటిస్తున్నారు.
» బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచి ‘స్లీప్ పారడాక్స్’గా నిలిచింది. ఇక్కడ 36.3% మంది అర్ధరాత్రి తర్వాత నిద్రపోతుండగా 54% మంది నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించలేదన్నారు.
» ఢిల్లీలో 45% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 32% మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
» కోల్‌కతా ‘లేట్‌నైట్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ75.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నట్లు తెలిపారు.
» ముంబై అత్యంత నిద్రలేమి నగరంగా నిలిచింది. ఇక్కడ 76.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 42.5% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 62.6% మంది నిద్రలేచాక విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించట్లేదని చెప్పారు. దాదాపు 60% మంది పనివేళల్లో నిద్రమత్తుగా అనిపిస్తోందని చెప్పడం గమనార్హం.
డిజిటల్.. స్లీప్ డల్...
డిజిటల్ పరికరాలపై ఆధారపడటం, అస్తవ్యస్తమైన పనివేళలు, పెరుగుతున్న అలసట దేశవ్యాప్తంగా నిద్ర విధానాలను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకం నిద్రకు భంగం కలిగించే అత్యంత సాధారణ ప్రవర్తన అని ఈ నివేదిక గుర్తించింది. 87.6 శాతం మంది రాత్రిపూట స్క్రీన్ ప్రభావానికి గురవుతున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, బింజ్–వాచింగ్ ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వంటి కార్యకలాపాలు నిద్ర నాణ్యత క్షీణించడానికి ముఖ్య కారణాలు.
ఉత్పాదకత... హుష్ కాకి...
నిద్రలేమి పనితీరుపై, ఉత్పాదకతపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. మెట్రో నగరాల్లో కార్యాలయ అలసట ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 64.4% మంది పగటిపూట నిద్రమత్తుకు లోనవుతున్నారు. బెంగళూరులో 61.7%, ముంబైలో 59.2% మందిది కూడా ఇదే పరిస్థితి. 57.8% మంది పనివేళల్లో నిద్రమత్తుగా ఉన్నట్లు చెప్పారు. ఇది 2025తో పోలిస్తే 7.8% అధికం. అదనంగా, 48.7% మంది భారతీయులు నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపించట్లేదని చెప్పారు.
ఆలస్యపు ఉదయాలు...
ఈ సర్వేలో ప్రజలు క్రమంగా ఆలస్యంగా నిద్రపోవడం వైపు మారుతున్నారని స్పష్టమైంది. 12%మంది మాత్రమే రాత్రి 10 గంటల్లోగా నిద్రపోతూ ఆరోగ్యకర నిద్రవేళలను పాటిస్తుండగా దాదాపు 60% మంది రాత్రి 11 గంటల తర్వాతే నిద్రపోతున్నారు. 29.1% మంది ‘కుదించబడిన నిద్రవేళలను’అనుభవిస్తున్నారు. అంటే ఆలస్యంగా నిద్రపోయినా పని ఒత్తిడి కారణంగా ఉదయాన్నే మేల్కొంటున్నారు. గతేడాదిలో 6 గంటల కంటే తక్కువ సేపే నిద్రపోయామని 46% మంది భారతీయులు తెలిపారు.


