తొలి విడత రైతుభరోసాకు నిధులు విడుదల చేయనున్న సర్కారు
ఎన్ని ఎకరాలున్నా మొదట ఒక ఎకరంలోపు విస్తీర్ణానికి పెట్టుబడి సాయం
మొత్తం 73 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లు
ఈనెల 22న సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ
గతంలో తొలుత ఎకరం లోపు ఉన్న రైతులకు, తర్వాత 2 ఎకరాల లోపు, ఆపై ఉన్న వారికి అందజేత
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను ‘రైతు భరోసా’కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి అదే వేదిక నుంచి ‘రైతుభరోసా’తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా మొదటి విడతలో.. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా ఒక ఎకరం లోపు విస్తీర్ణానికే సాయం విడుదల చేయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ‘రైతు బంధు’కింద 2018 జూన్ నుంచి గత వానాకాలం సీజన్‌లో ప్రారంభించిన ‘రైతు భరోసా’పథకం వరకు..దశల వారీగా మొదట ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, తర్వాత రెండెకరాలు, అంతకు మించి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగేది. ఈసారి ఆ విధానాన్ని మార్చి తొలి విడతలో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఒక ఎకరానికి రూ.6 వేలు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ కానుంది.
తొలివిడతగా 73 లక్షల మందికి రూ.3,590 కోట్లు
గత ఏడాది జూన్ 16వ తేదీన వానాకాలం సీజన్ రైతుభరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే 69.40 లక్షల మంది రైతులకు చెందిన 145.75 లక్షల ఎకరాల విస్తీర్ణానికి రూ.8,744.13 కోట్ల మొత్తాన్ని అందజేసింది. అందులో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు (13.54 లక్షల ఎకరాల సాగు భూమికి) రూ.812.63 కోట్లు చెల్లించారు. కానీ ఈసారి రైతులందరికీ ఎకరం లోపు విస్తీర్ణానికి సాయం అందించనున్నారు.
ఈ విధంగా 73 లక్షల మంది రైతులకు సాయం అందిస్తుండగా.. ఇవ్వాల్సిన మొత్తాన్ని రూ.3,590 కోట్లుగా తేల్చారు. ఇలా చేయడం ద్వారా ప్రతిరైతుకు పెట్టుబడి సాయం అందిందనే తృప్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భావించినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక రెండో విడత కింద రూ. 2,650 కోట్లను ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. మూడో విడత కింద మిగతా మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేయాలని నిర్ణయించారు.
విస్తీర్ణంలోనూ మార్పులు
రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి 1.50 కోట్ల ఎకరాలకు పైగానే ఉంటుందని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. అయితే ఇందులో వానాకాలం సీజన్‌లో పూర్తిస్థాయిలో సాగులో ఉన్న భూమి 1.30 కోట్ల ఎకరాలు. మిగతా భూమిలో మామిడి, నిమ్మ, దానిమ్మ, ఇతర ఉద్యాన తోటలు 12 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. మిగతా భూమి సాగులో లేకపోయినా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అందింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సాగు చేసే భూములకు మాత్రమే సీజన్ల వారీగా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది.
కానీ రైతుల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంగా పాత పద్ధతినే కొనసాగించింది. గత జూన్‌లో మొత్తం 145.73 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. ఈసారి 73 లక్షల మంది రైతులకు మొత్తం రూ.8,881 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ నేపథ్యంలో ఈసారి రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు.


