స్టోరీతో వస్తే రీల్‌తో వెళ్లేలా.. | CM Revanth Reddy at the 2025 Telangana Gaddar Film Awards Presentation Ceremony | Sakshi
Sakshi News home page

స్టోరీతో వస్తే రీల్‌తో వెళ్లేలా..

Mar 20 2026 1:28 AM | Updated on Mar 20 2026 1:28 AM

CM Revanth Reddy at the 2025 Telangana Gaddar Film Awards Presentation Ceremony

సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకుంటున్న చిరంజీవి, పైడి జయరాజ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న కమల్‌హాసన్‌. చిత్రంలో మాధురీ దీక్షిత్, నాగార్జున

సినీ పరిశ్రమకు సింగిల్‌ విండో విధానం 

తెలంగాణ గద్దర్‌ సినీ అవార్డులు–2025 ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

చిత్ర పరిశ్రమకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం 

గ్లోబల్‌ సినీ హబ్‌గా తీర్చిదిద్దుతాం..

సామాజిక సమస్యలపరిష్కారానికి సినిమాలు దోహదపడాలన్న ముఖ్యమంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కేవలం స్టోరీతో సంప్రదిస్తే సినిమా పూర్తి చేసుకుని రీల్‌తో వెళ్లే విధంగా వెంట వెంటనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మా పరిశ్రమకు సమానంగా సినీ పరిశ్రమను గుర్తించామని, చిత్ర    పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గురువారం హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్‌ సినీ అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.  

ఆ నలుగురు చార్‌ మినార్ల వంటివారు.. 
‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ హబ్, బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొక సినిమా హబ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. భారతీయ సినీ పరిశ్రమకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌కు చార్మినార్‌లోని చార్‌ మినార్ల లాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ..ఈ నలుగురు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రామోజీరావు ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. 

ప్రభాకర్‌రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు. ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచి్చనా ముందుండే దాసరి నారాయణరావును కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సినీ హబ్‌ గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్‌ ఫ్లిక్స్‌ తమ సంస్థను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసింది. నెట్‌ ఫ్లిక్స్‌ వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్‌ వచ్చినట్టే. 

గద్దర్‌ ఒక చైతన్యం.. ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషం. సినిమా అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. సమాజాన్ని చైతన్యపరిచేందుకు దీన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్‌ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమా ద్వారా సందేశం అందించాలి..’అని సీఎం సూచించారు. 

సందేశాత్మక సినిమాలతో ప్రజల్లో మార్పు: డిప్యూటీ సీఎం 
‘తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గద్దర్‌. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమే. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్‌ స్థాయికి ఎదిగింది. అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయి. 

అయితే గత పాలకులు 10 ఏళ్ల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి గద్దర్‌ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారు..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement