రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ ఇచ్చే అవకాశం
డ్రగ్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మూడో రోజు సుదీర్ఘ విచారణ
ఎంపీ పుట్టా మహేశ్ మినహా మిగిలిన ఏడుగురు విచారణకు హాజరు.. డ్రగ్స్ మూలాలపైనే పోలీసుల దృష్టి
మొయినాబాద్, శంషాబాద్ రూరల్ : ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేయడంతో ఇప్పటికే రోహిత్‌రెడ్డితోపాటు అతని తమ్ముడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మను పోలీసులు జైలుకు పంపారు. డ్రగ్స్ మూలాలపై దృష్టి పెట్టిన పోలీసులు ఫాంహౌస్ కేంద్రంగా ఏయే రకాల దందాలు కొనసాగుతున్నాయనే విషయాలను వెలికితీస్తున్నారు.మరో వైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్ చేసేందుకు లేఖ రాస్తామని పోలీసులు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రెవెన్యూ అధికారులకు లేఖ అందే అవకాశం ఉంది.
మూడో రోజు సుదీర్ఘ విచారణ..
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో స్టేషన్ బెయిల్ పొందిన నిందితులను సిట్ అధికారులు మూడో రోజు సుదీర్ఘంగా విచారణ చేశారు. స్టేషన్ బెయిల్ పొందిన ఎనిమిది మందిలో ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు గురువారం మూడో రోజు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 11 గంటల పాటు విచారించారు.
డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? ఎవరు సరఫరా చేశారు? రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎంత కాలం నుంచి డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి? వీటికి ఎవరిని పిలిచారు? శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రధానంగా ఏం చర్చించాలనుకున్నారు? అనే విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, ్రపాంతాలకు చెందిన 11 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారంటే వీరి మధ్య ఎలాంటి బిజినెస్ డీల్ జరిగిందనే కోణంలో ఆరా తీశారు. ప్రధానంగా డ్రగ్స్ మూలాలపైనే సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్‌శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని ఓ అధికారి తెలిపారు.
ఫాంహౌస్ సీజ్ చేసే అవకాశం
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 177/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిలో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ ఉంది. ఈ భూమిని ప్రభుత్వం అంతంగారి జంగయ్యకు అసైన్డ్ చేసింది. కొంత కాలం క్రితం రోహిత్‌రెడ్డి తన తండ్రి విఠల్‌రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేశారు.
అయితే రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ అంతంగారి జంగయ్య పేరుతోనే కొనసాగుతోంది. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ నిర్మించి అందులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తోపాటు డ్రగ్స్ పార్టీ, గన్ ఫైరింగ్ వంటి వివాదాలకు ఈ ఫాంహౌస్ కేంద్ర బిందువుగా మారడంతో సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేడే..
డ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, నమిత్‌శర్మను ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. దీనిపై బుధవారం వాదనలు జరగడంతో తీర్పును శుక్రవారానికి రిజర్వు చేశారు. శుక్రవారం కోర్టు కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది. వారిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపితే కీలక విషయాలు వెలుగుచూస్తాని పోలీసులు సైతం భావిస్తున్నారు.


