ర్యాన్సమ్‌వేర్‌ దాడులపై జాగ్రత్త | Centre Warns Chartered Accountancy and Consulting Firms | Sakshi
Sakshi News home page

ర్యాన్సమ్‌వేర్‌ దాడులపై జాగ్రత్త

Mar 20 2026 12:46 AM | Updated on Mar 20 2026 12:46 AM

Centre Warns Chartered Accountancy and Consulting Firms

చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కన్సల్టింగ్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరిక

ఎన్‌ఏఎస్‌లపై ఇలాంటి దాడులు పెరుగుతున్నాయన్న హోంశాఖ 

ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పరిమితం చేయాలని,బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌ :  నెట్‌వర్క్‌ అటాచ్డ్‌ స్టోరేజ్‌ (ఎన్‌ఏఎస్‌) పరికరాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ర్యాన్సమ్‌వేర్‌ దాడులపై పౌరులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా చార్టర్డ్‌ అకౌంటెన్సీ సంస్థలు, కన్సల్టింగ్‌ సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ ఎన్‌ఏఎస్‌లపై ఈ తరహా దాడులు ఇటీవల కాలంలో పెరిగినట్టు నేషనల్‌ సైబర్‌ క్రైం థ్రెట్‌ అనలిటిక్‌ యూనిట్‌ వెల్లడించింది. రాన్సమ్‌వేర్‌ ఎన్‌ఏఎస్‌ పరికరాలను హ్యాక్‌ చేసి డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేయడం (కోడ్‌ మార్చడం), సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, పరిహారం (ర్యాన్సమ్‌) డిమాండ్‌ చేయడం జరుగుతోందని తెలిపింది. 

ఎన్‌ఏఎస్‌ అంటే...? 
నెట్‌వర్క్‌ అటాచ్డ్‌ స్టోరేజ్‌ (ఎన్‌ఏఎస్‌ ) పరికరం అనేది ఒక కేంద్రీకృత స్టోరేజ్‌ వ్యవస్థ. ఇది సంస్థ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి, అనేకమంది వినియోగదారులు ముఖ్యమైన ఫైళ్లను నిల్వ చేయడానికి, యాక్సెస్‌ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక ప్రైవేట్‌ క్లౌడ్‌ లాంటి వ్యవస్థగా పనిచేస్తుంది. దీన్ని హ్యాక్‌ చేసేవారు మొత్తం స్టోరేజ్‌ వ్యవస్థను ఎన్‌క్రిప్ట్‌ చేసి, గోప్యమైన డేటాను దొంగిలించి, పరిహారం చెల్లించకపోతే దాన్ని బహిరంగ పరుస్తామంటూ బెదిరించేందుకు అవకాశం ఉంటుంది. 

అప్రమత్తంగా ఉండాలి..:  
ఎన్‌ఏఎస్‌ పరికరాలు నేరుగా ఇంటర్నెట్‌కు అందుబాటులో ఉండకుండా, సాధ్యమైనంతవరకు యాక్సెస్‌ను పరిమితం చేయాలి. 
» బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించి, అవసరమైన చోట మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటిఫికేషన్‌ పెట్టుకోవాలి.  
»  పరికర ఫర్మ్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేయాలి. 
» ముఖ్యమైన డేటాకు సురక్షితమైన ఆఫ్‌లైన్‌ లేదా ఎయిర్‌ గ్యాప్‌ బ్యాకప్‌లు నిర్వహించాలి. 
» ఏదైనా సైబర్‌ మోసం లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే 1930కు కాల్‌ చేయాలి లేదా  www. cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.  

Advertisement
 
Advertisement
Advertisement