ఈసారి భారీగా రాష్ట్ర బడ్జెట్
గత ఏడాది అంచనాల కంటే 10 శాతం పెరుగుదల!
2034 విజన్‌కు అనుగుణంగా ప్రతిపాదన
స్థిరంగా పెరుగుతున్న పన్ను ఆదాయానికి తోడు ఇతర మార్గాలపై భరోసా
కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధులు పెరుగుతాయని అంచనా
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
సంక్షేమానికే పెద్దపీట.. రూ.లక్ష కోట్లకు పైగానే కేటాయింపు
విద్య, వైద్యం, వ్యవసాయానికీ ప్రాధాన్యం
పాత పథకాల కొనసాగింపు.. ఆరు కొత్త పథకాలు!
సాక్షి, హైదరాబాద్: ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం.
స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి.
ఈసారి దూకుడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే గత రెండు బడ్జెట్‌లలోనూ ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. అనేక అంచనాలు, ఆశలతో ఈసారి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, 2025–26లో 5 శాతం పెంచి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అదే ఒరవడి కొనసాగితే 2026–27కు రూ.3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముంది.
కానీ ఏకంగా 10 శాతం పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకశాముందనే అంచనాలు, భూముల అమ్మకాలు, భూముల విలువల సవరణల ద్వారా మరిన్ని నిధులు సమకూరతాయనే ఆలోచనతో రూ.3.35 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అప్పుల పద్దూ భారీగానే..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 64,539 కోట్లు సేకరించాలని నిర్ణయించగా, ఈసారి దాన్ని రూ.80 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత రెండు బడ్జెట్‌లలో భూముల అమ్మకాల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదనలు లేవు. కానీ ఈసారి అనివార్యమవుతోందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ.3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రతిపాదన కూడా చేయనున్నట్టు సమాచారం.
రూ.50 వేల కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలు
విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా మూలధన వ్యయాన్ని కూడా పెంచనున్నారు. 2025–26లో రూ.36 వేల కోట్ల మూల ధన వ్యయం అంచనా వేసినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ.50 వేల కోట్లను చేరింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపాదనలే రూ.50 వేల కోట్లకు చేరనున్నట్టు సమాచారం. 2025–26లో రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌కు గాను రూ.2.90 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలుంటాయని భావిస్తూ ఈ మొత్తానికి మరో రూ.45 వేల కోట్లు కలిపి ఈసారి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు సమాచారం.
అభిజిత్ లగ్నం..రేవతి నక్షత్రం
విజయ ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశలో ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్ర అభిజిత్ లగ్నం సమయంలో అసెంబ్లీ ముందుంచనున్నారు. దీనికి ముందు ఉదయం ప్రజాభవన్‌లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి.. మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 9:30 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అదే సమయంలో శాసనమండలిలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు.
పింఛన్లు, కల్యాణలక్ష్మి సాయం పెంపు
ఈసారి బడ్జెట్‌లో ఎప్పటిలాగే సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు యంగ్ ఇండియా స్కూల్స్ వరకు అన్నిటి బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, సన్న బియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అన్ని పథకాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నారు.
అదే సమయంలో చేయూత పింఛన్లు రూ.500 చొప్పున పెంపు, కల్యాణలక్ష్మికి రూ.50 వేల అదనపు లబ్ధి ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. వీటికి తోడు మరో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రంలోని దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రకటిస్తారని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, యంగ్ ఇండియా కిట్స్, పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, వృద్ధ అర్చకులకు పింఛన్లకు తోడు ఎన్నికల హామీలో భాగంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు అందించే కార్యక్రమానికి కూడా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.


