ఘజియాబాద్‌ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి | Ghaziabad sisters in grim note left behind after suicide | Sakshi
Sakshi News home page

ఘజియాబాద్‌ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి

Feb 5 2026 9:52 AM | Updated on Feb 5 2026 10:01 AM

Ghaziabad sisters in grim note left behind after suicide

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ‘కొరియన్‌ లవ్‌’ గేమింగ్‌ టాస్క్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలయ్యారు. వారు టాస్క్‌ పూర్తి చేయడంలో భాగంగా తమ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో అంతస్తు కిటికీ నుండి దూకి ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలంలో పోలీసులు ఎనిమిది పేజీల డైరీని, గ్లాస్ ప్యానెల్‌పై రాసిన మరికొన్ని నోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మమ్మల్ని కొరియా వెళ్లకుండా ఆపుతారా?’ అని రాసి ఉన్న వాక్యాలు చూసి పోలీసులు  ఆశ్చర్యపోయారు. కొరియన్ సంస్కృతిపై విపరీతమైన వ్యామోహం, ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కావడమే ఈ దారుణానికి ప్రాథమిక కారణాలని పోలీసులు చెబుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికలు కే-డ్రామాలు, కే-పాప్ సంగీతానికి ఎంతలా ఆకర్షితులయ్యారంటే, వారు తమ నిజమైన పేర్లను వదిలేసి అలీజా, సిండి, మారియా అనే కొరియన్ పేర్లతో పిలుచుకునేవారు. తమకంటూ ఒక ప్రత్యేక ఊహాలోకాన్ని సృష్టించుకున్న ఈ బాలికలు చైనా, జపాన్, థాయ్‌లాండ్ సంస్కృతులను కూడా అమితంగా ఇష్టపడేవారు. ‘మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, కనీసం మా సోదరుడు కూడా మా ఇష్టాన్ని గుర్తించడం లేదు’ అని వారు తమ డైరీలో ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే కోరిక నెరవేరకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది.

ఈ అక్కాచెల్లెళ్లు 2020 నుండే పాఠశాలకు వెళ్లడం మానేశారు. వీరికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవని, ఇరుగుపొరుగు వారితో కూడా మాట్లాడేవారు కాదని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి ఇటీవల తాను వాడుతున్న ఏకైక మొబైల్ ఫోన్‌ను రూ. 3,500లకు అమ్మేశారు. అలాగే 2,000 మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఖాతాను తొలగించడం  ఆ అక్కాచెల్లెళ్లను తీవ్రంగా కలచివేసింది. ఈ నేపధ్యంలోనే వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఆ బాలికల తండ్రికి ముగ్గురు భార్యలున్నారని, వారు ముగ్గురూ అక్కాచెల్లెళ్లేనని పోలీసుల విచారణలో తేలింది. ఒకే ఫ్లాట్‌లో ఈ కుటుంబమంతా నివసిస్తోంది. కుటుంబంలోని సభ్యుల విభిన్న పోకడలు, ఆర్థిక ఇబ్బందులు బాలికల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత గేమ్‌ల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. 

ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్‌’ షాక్‌.. 300 మంది ఉద్యోగుల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement