లోక్‌సభ వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్ | Parliament Nadda expressed anger over the oppositions conduct | Sakshi
Sakshi News home page

లోక్‌సభ వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్

Feb 5 2026 11:53 AM | Updated on Feb 5 2026 12:17 PM

Parliament Nadda expressed anger over the oppositions conduct

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ ఉభయ సభలు తీవ్ర వాదోపవాదాలతో అట్టుడికాయి. లోక్‌సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం నాటి ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యంగా లడఖ్ సరిహద్దు అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది.

రాజ్యసభలో ఖర్గే వర్సెస్ రిజిజు
రాజ్యసభలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, లోక్‌సభలో రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. సభ ఎవరి ఇష్టానుసారమో నడవదని, నిబంధనల ప్రకారమే సాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి స్పీకర్ 40 నిమిషాల సమయం ఇచ్చారని, అయినప్పటికీ ఆయన నిబంధనలు అతిక్రమించి మాట్లాడారని రిజిజు ఎదురుదాడి చేశారు. 

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ స్పీకర్ ఆదేశాలను గౌరవించకుండా ప్రసంగాన్ని కొనసాగించారని, ఇది సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తాను దేశానికి తెలియని అనేక రహస్య పత్రాలను, పుస్తకాలను సభ ముందు ఉంచుతున్నానని దూబే తెలిపారు.

జెపి నడ్డా మాట్లాడుతూ ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు సభను సాగనీయడం లేదని మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ సైతం ఖర్గే చేసిన ‘లించింగ్’ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాత ఘటనలను గుర్తుచేశారు. సభలో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలోనే మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ‘ఇండియా’ కూటమి నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు లోక్‌సభలో ప్రధాని ప్రసంగానికి ఆటంకం కలగడంతో, ఆయన నేడు సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్‌కు చేరుకుని కీలక నేతలతో చర్చలు జరిపారు. సభలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement