ఈయూ ట్రేడ్ డీల్‌తో యువత, రైతులు, తయారీదారులకు కొత్త అవకాశాలు
నాణ్యతపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ప్రధాని మోదీ పిలుపు
బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ పార్లమెంట్ ఆవరణలో మోదీ ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడొక కొత్త ఆశాకిరణంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్‌తో భారత్ బుధవారం చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న మరుసటి రోజే బడ్జెట్ సమావేశాలు ఆరంభమవడంతో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఆశయాల భారత్ ఇది. అత్యంత కీలకమైన ఐరోపా కూటమితో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో భారతీయ భారతీయ తయారీదారులకు సువర్ణావకాశం దక్కింది. 27 ఈయూ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేద్దాం.
ఇకనైనా సంస్థలు ఐరోపా విపణిలోకి విస్తృతంగా విస్తరించేలా, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘‘సమాజంలో అట్టడుగు, చిట్టచివరి వ్యక్తికి సైతం ప్రభుత్వ ప్రయోజనాలు దక్కేలా ఎన్‌డీఏ సర్కార్ కృషిచేస్తుందని విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తాం. భవిష్యత్ తరాలకు సంస్కరణల ఫలాలను అందిస్తాం. భారత ప్రజాస్వామ్యం, భారత జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి గొప్ప అవకాశాలు, వనరులుగా కన్పిస్తున్నాయి.
ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో భారతదేశం తన శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్యం పట్ల తన అంకితభావాన్ని, ప్రజాస్వామ్యయుతంగా తీసుకునే నిర్ణయాలను భారత్ గౌరవిస్తుందనే సందేశాలను గట్టిగా విన్పించే అవకాశం మనకు దక్కింది. ఈ సందేశాలను ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆమోదిస్తున్నాయి, శ్లాఘిస్తున్నాయి. నేటి సమాజం అవరోధాలు సృష్టించేందుకుకాదు సమస్యల పరిష్కారం కోసమే ఉంది. విధ్వంసాలు కాదు తీర్మానాలు కావాలి. భారత్ ఇటీవలే దీర్ఘకాలిక సమస్యల వలయం నుంచి బయటపడి దీర్ఘకాలిక భవిష్యత్ ఆశయాల సాధన దిశలో వడివడిగా అడుగులేస్తోంది.
ఇదే తరుణంలో 21వ శతాబ్దపు తొలి పావుభాగం ముగింపునకు, తర్వాత పావుభాగం ఆరంభానికి తాజా బడ్జెట్ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది మనకెంతో సానుకూలంగా ఉంది. ప్రపంచానికి భారత్ ఒక కొత్త ఆశాకిరణంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ప్రపంచంలో మనమే ప్రధాన ఆకర్షణ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ త్రైమాసిక తొలినాళ్లలోనే కుదిరిన ఎఫ్‌టీఏ ఒప్పందం.. మన భారతీయ యువత బంగారు భవితకు కొత్త చివుళ్లు తొడిగిస్తోంది. కొత్త బాసట బాటలో నడిపిస్తోంది. ఆశయాల భారత్, ఆశావహ యువత, ఆత్మనిర్భర్ భారత్ కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’’అని మోదీ అన్నారు.
మనీతోపాటు మనసుల్ని గెల్చుకుందాం..
‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పేరొందిన ఈ ఒప్పందం ద్వారా మనం సరకులను ఈయూ మార్కె ట్లోకి ముంచెత్తేలా చేద్దాం. తయారీ దారులకు ఆత్మ సంతృప్తి ఎంత అవసరమో సరకుల నాణ్యత అనేది కూడా అంతే ఆవశ్యకం. నాణ్యమై న వస్తూత్పత్తులను అందించడం ద్వారా మంచి లాభాలను గడించండి. నాణ్యమైన ఉత్ప త్తుల ఎగుమతితో యూరప్ దేశవాసుల మన సులనూ గెల్చుకో వచ్చు. దీంతో దశాబ్దాలపాటు మంచి పేరు అలాగే నిల్చి ఉంటుంది. వాణిజ్యబంధమూ బలపడుతుంది. ఇక్కడి బ్రాండ్‌లను అక్కడ పరిచయం చేయడంతోపాటు భారతీయత అనే బ్రాండ్‌నూ సుస్థిరంచేయండి. తద్వారా భారత్‌కు మరింత ప్రతిష్టను తీసుకురండి’’ అని తయారీదారులకు మోదీ సూచించారు.


