రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.
గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్‌పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్‌పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు.
శ్రీనివాసన్ సీఐఎస్‌ఎఫ్ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు.


