Odisha: ఒక్కసారిగా పట్టాలు తప్పిన మూడు బోగీలు.. | Odisha as three coaches skid off track near Jakhapura railway station | Sakshi
Sakshi News home page

Odisha: ఒక్కసారిగా పట్టాలు తప్పిన మూడు బోగీలు..

Feb 5 2026 1:24 PM | Updated on Feb 5 2026 1:40 PM

Odisha as three coaches skid off track near Jakhapura railway station

జాజ్‌పూర్: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. జఖపురా రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని మూడు బోగీలు ఒక్కసారిగా ట్రాక్ పైనుంచి పక్కకు జరిగాయి. భువనేశ్వర్ నుండి కోల్‌కతా మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 8:51 గంటలకు ప్రమాదం జరగగా, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక రైళ్లు ఘటనా స్థలానికి బయలుదేరాయి. వీటితో పాటు ఖుర్దా రోడ్ నుండి అత్యాధునిక వైద్య పరికరాల బృందాన్ని కూడా పంపించారు. భద్రక్ నుంచి వచ్చిన ప్రత్యేక సహాయక బృందం కూడా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేసింది.

ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. భద్రక్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ బృందాలు పట్టాలను సరిచేసి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు  ఘటనా స్థలంలో ఉండి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని  నిర్ధారించారు. కాగా, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఢిల్లీ-ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.

ఇది కూడా చదవండి: ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement