తలలో తెల్లవెంట్రుకలను కవర్ చేయడానికి కలర్ వేయడం ఇప్పుడు కామనైపోయింది. తెల్లబడిన జట్టును నల్లగా మార్చడానికి ఎక్కువ మంది హెయిర్‌డై పెట్టుకుంటారు. మరికొందరు గోరింటాకు పేస్టు కూడా తలకు అప్లై చేస్తుంటారు. కాస్త భిన్నంగా కనిపించాలని తాపత్రయపడేవారు రకరకాల రంగులు ట్రై చేస్తుంటారు. ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఇలాగే చేసి చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఎవరాయన?
రష్మి రంజన్ దాస్.. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 49 ఏళ్ల రంజన్ దాస్‌కు స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరుంది. అసాంఘిక శక్తులపై ఆయన కఠినంగా వ్యవహరిస్తారని అంతా అనుకుంటూ ఉంటారు. బుధవారం నాడు (జనవరి 28) ఆయన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ (Viral) అయింది. ఈ ఫొటోలో తలకు ఎర్రరంగుతో ఆయన డిఫరెంట్‌గా కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్, జోక్స్ (Jokes) పోటెత్తాయి. ఫలితంగా ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు.
పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు యూనిఫాంను గౌరవించాలని.. క్రమశిక్షణ, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రష్మి రంజన్ దాస్ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్య తీసుకున్నట్టు తెలిపారు. హ్యుమన్‌రైట్స్ ప్రొటెక్షన్ సెల్‌కు దాస్‌ను ఎటాచ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడడానికి దాస్ నిరాకరించారు.
ముందే హెచ్చరించినా..
తలకు ఎరుపు రంగు తీసివేయాలని గతంలోనూ ఉన్నతాధికారులు అనధికారికంగా దాస్‌ను హెచ్చరించినట్టు సహచర ఉద్యోగులు తెలిపారు. పై అధికారుల మాటలను అతడు ఖాతరు చేయకపోవడంతో తాజాగా చర్య తీసుకున్నట్టు చెప్పారు. పోలీసు మాన్యువల్‌లో(Police Manual) హెయిర్ స్టైల్స్‌కు సంబంధించి స్పష్టమైన నియమాలు లేనప్పటికీ.. గౌరవ భావం కలిగేలా క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి దాస్ వివాదంతో.. క్రమశిక్షణ, హుందాతనం విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని సందేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చారు.


