పురుషుల కంటే మహిళలకే డీప్‌ఫేక్ ముప్పు
62% సంఘటనల్లో మౌనంగా బాధితులు
ఫిర్యాదుల్లో బెంగళూరు, హైదరాబాద్ టాప్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్‌ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్‌ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.
ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్‌ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్‌లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.
ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న కంటెంట్‌లో డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి.
మౌనంగా బాధితులు..
మహిళలకు సంబంధించిన 62% డీప్‌ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.
పరిశ్రమలా విస్తరించాయి..
డీప్‌ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్‌ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్‌ఫేక్‌లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు.


