వామ్మో.. ఈయనగారి తెలివి మామూలుగా లేదు. పనిచేస్తున్న సంస్థకే పంగనామం పెట్టి మస్తు పైసలు వెనకేసుకున్నాడు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసే లంచాలు మరిగి పెడదారి పట్టాడు. కోట్ల రూపాయల అక్రమాస్తులు వెనకేసుకుని అడ్డంగా దొరికిపోయాడు. పాపం పండడంతో కోర్టు మెట్లు ఎక్కి విచారణ ఎదుర్కొంటున్నాడు.
విజయనగరం క్రైమ్/గుర్ల: విజయనగరం అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరిన నెట్టి శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు అక్షరాలా రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గుతేల్చారు. ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దాడుల వివరాలను సంబంధిత వ్యక్తులకు ముందుగానే ఆయన చేరవేసేవాడు. దీనికోసం రూ.వేలు, రూ.లక్షల్లో తీసుకునేవాడు.
ఆయనపై అనుమానం వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారులు ఏడాదిన్నర క్రితం ఎస్పీ ఆఫీస్‌కు బదిలీ చేసి నిఘా పెట్టారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్‌మెంట్, బంధువుల ఇళ్లలో గురువారం సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్టుచేసి విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
చదవండి: పాపం.. మహిళా కానిస్టేబుల్ విషాదగాథ


