సాక్షి, హన్మకొండ: పోకిరీల ఆటకట్టించే పోలీసే వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుఏకుంది. ఇద్దరు యువకుల వేధింపులతో మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్య చేసుకుంది. ఒకడు ప్రేమించి మోసం చేయగా.. మరొకడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురిచేయడంతో అనిత ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. అయితే, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్.. అనితకు బంధువు అవుతాడు. అనితను పెళ్లిచేసుకుంటానని రాజేందర్ గత నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని.. వేరే ఎవరితోనూ చనువుతో మాట్లాడవద్దని కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డాడు. రాజేందర్ వైఖరి నచ్చకపోవడంతో ఈ విషయాన్ని అనిత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అనితను ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని రాజేందర్‌కు తెగేసి చెప్పాడు. అయినా అనితను ఇచ్చి పెళ్లి చేయాలని బతిమిలాడుతూనే ఉన్నాడు.
ఈ క్రమంలో అనితకు తన క్లాస్‌మేట్ జబ్బార్ లాల్‌తో చనువు ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం రాజేందర్‌కు తెలిసింది. దీంతో, కోపంతో జబ్బార్‌కు రాజేందర్ ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. అప్పటి నుంచి జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇద్దరి వేధింపులతో మానసికంగా కుంగిపోయిన అనిత ఈ నెల 27న రాజేందర్‌కు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది.
నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు.. మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. కానీ రాజేందర్ ఆ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే గడ్డిమందు తాగి అనిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అనితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అనిత మరణించింది. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


