క్షణికావేశంతో తోటి ప్రయాణికుడు, కాలేజీ ప్రొఫెసర్‌ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కదులుతున్న లోకల్ రైలు నుండి దిగుతున్నప్పుడు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చేసుకుంది.
మలాడ్ రైల్వే స్టేషన్‌లో దిగేందుకు ప్రయాణికులు సిద్దమవుతున్నారు. ఫుట్‌బోర్డు దగ్గర ఇద్దరు మహిళలు నిలబడి ఉన్నారు. ఇంతలో వారిని తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించాడు. 27 ఏళ్ల షిండే. దీంతో ముందు మహిళలు ఉన్నారు కదా.. కనపించడం లేదా అని మందలించాడు వారి వెనుక ప్రొఫెసర్ అలోక్ కుమార్ సింగ్. చాలా సాధారణంగా చెప్పిన ఆ మాటలే తన పాలిట మరణ దండనగా మారిపోతాయని ఆయన అస్సలు ఊహించి ఉండడు. కోపోద్రిక్తుడైన షిండే స్టేషన్‌లో దిగగానే ఫ్లాట్‌ఫామ్‌మీదే సింగ్‌ను అతి దారుణంగా పొడిచాడు. దీంతో సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఇది చూసి నిందితుడు షిండే అక్కడినుంచి పారిపోయాడు. సింగ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఈయన విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత వారం ఈ సంఘటన జరిగింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా సింగ్ తనను నెట్టి, అవమానించాడని, ఆ మహిళలు వెనక్కి తిరిగి తన వైపు చూశారు. దీంతో అవమానానికి గురయ్యానని పోలీసులకు చెప్పాడు. అందుకే అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నానని, ఆయన చనిపోయిన విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించాడు. షిండేకు జనవరి 29 వరకు పోలీసు కస్టడీ విధించారు.
పోలీసు వర్గాల ప్రకారం, షిండే తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మలాడ్‌లో నివసిస్తున్నాడు. తల్లి గృహిణి, తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అతని సోదరుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిందితుడు గ్రాంట్ రోడ్‌లో చిన్న నకిలీ ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తన కొడుకుకు కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది ఉందని షిండే తండ్రి పోలీసులకు తెలిపారు.
ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!


