ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో బజారునపడ్డ టీడీపీ పరువు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్‌గా మారిందంటున్న ప్రజలు
కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు
రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు
బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్, గంజాయి మాఫియా
పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటున్న నెటిజన్లు
ఇంత జరిగినా నోరు మెదపని చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్‌లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది.
డ్రగ్స్: డోర్ డెలివరీ
⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్‌నే ప్రధాన మార్కెట్‌గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్‌సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్‌ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది.
⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి.
⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. 
కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత
⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం.
⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్‌డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే
డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.
చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది.
⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది.
⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్‌పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్‌ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.
కబళిస్తున్న నకిలీ మద్యం
⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం
⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్‌ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది.
⇒ అన్నమయ్య, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు.
⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది.
⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.


