ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి | A life was lost due to the overzealousness of the traffic police | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి

Mar 16 2026 4:56 AM | Updated on Mar 16 2026 4:56 AM

A life was lost due to the overzealousness of the traffic police

వాహన తనిఖీలు చేస్తుండగా కంగారులో వెనుదిరిగిన యువకులు

వెంబడించిన కానిస్టేబుల్‌

తప్పించుకునే యత్నంలో వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

గన్నవరం: ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వాహన తనిఖీల పేరిట ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన స్కూటీపై వెళ్తున్న సోదరుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన వెలుగు చూసింది. వివరాలిలా.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని శివాజీ కొడుకులు ప్రణయ్‌(22) కేఎల్‌యూలో ఇంజినీరింగ్‌ ఫైనలియర్, కౌషిక్‌ విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. 

కౌషిక్‌ను పెద్దఅవుటపల్లిలో ట్యూషన్‌లో వదిలేందుకు సోదరుడు ప్రణయ్‌ స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక శ్రీనివాస హేచరీస్‌ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుంటారనే భయంతో స్కూటీని వెనక్కి తిప్పాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్‌ వారిని పట్టుకునేందుకు వెంబడించాడు. కంగారులో ప్రణయ్‌ రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ప్రణయ్‌ ఛాతీకి, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కౌషిక్‌ కూడా గాయపడ్డాడు. ట్రాఫిక్‌ పోలీసులు ఆటోలో ప్రణయ్‌ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహమే ప్రణయ్‌ మృతికి కారణమంటూ పలువురు ఆరోపించారు.

బాధిత కుటుంబానికి వంశీ పరామర్శ..
రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వైఎస్సార్‌సీపీ కేసరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు పలగాని శివాజీని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆదివారం పరామర్శించారు. తొలుత ప్రణయ్‌ భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్‌ అంతిమయాత్రలో వంశీమోహన్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement