తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత | Herat Remains in a Chaotic and Concerning Situation | Sakshi
Sakshi News home page

తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

Jun 11 2026 4:38 PM | Updated on Jun 11 2026 5:29 PM

Herat Remains in a Chaotic and Concerning Situation

ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్‌  ప్రావిన్స్  కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్‌లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ  కాల్పుల్లో  ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్‌లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్‌లోని కొందరు మసీదు ఇమామ్‌లు నిన్న ప్రజలను హెచ్చరించారు.

తాలిబాన్లు  నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని  స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు.  తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.

మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.

 జిబ్రిల్‌కు అదనపు బలగాల తరలింపు
జిబ్రిల్‌లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్‌లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.

అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్‌ మీడియా ద్వారా  ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి  కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.

మానవ హక్కుల సంఘాల స్పందన
దీనిపై అంతర్జాతీయంగా  కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్‌లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై  కాల్పులు  తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే  నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని  వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,

హెరాత్‌లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్‌ఫర్ స్పాంటా ఎక్స్‌లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.

మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేశారు.  హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement