న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.
ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్‌ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ


