సాక్షి, చెన్నై : రీల్స్, సెల్పీల వ్యామోహంతో సముద్రంలో దిగి మరీ వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చిన విద్యార్థుల బృందాన్ని భారీ అల తాకింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను జాలర్లు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. మరొకరు మరణించారు. శనివారం చెన్నై ఎన్నూర్ బీచ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై సూరపట్టులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న కృతిక (19), ఆకాష్ (21), పవిత్ర, తరుణ్, శివాని అనే ఐదుగురు విద్యార్థుల బృందం ఎన్నూర్ రామకృష్ణా నగర్ సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. సముద్రం మధ్యలో ఉండే రాళ్లపై నిలబడి సెల్ఫీ, వీడియోలు తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా వచ్చిన ఉగ్ర అలల తాకిడికి వారంతా సముద్రంలో పడిపోయారు.
స్థానిక మత్స్యకారుల సహాయంతో అక్కడున్నవారు ఇద్దరు విద్యార్థులను అతికష్టంపై రక్షించారు. సముద్రంలో మునిగి పోయి కొన ఊపిరితో ఉన్న కృతికను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలల్లో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఆకాష్ కోసం అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చేపట్టారు. బతికి ఉండేందుకు ఛాన్స్ లేని దృష్ట్యా, చెన్నై తీరంలో మృతదేహం ఏదైనా ఒడ్డుకు కొట్టుకువచ్చిందా? అని ఆరా తీస్తున్నారు. కాగా, మృతి చెందిన కృత్రిక పుదుచ్చేరికి చెందిన విద్యార్థి కాగా, ఆకాశ్ చెన్నై తిరునగర్ కు చెందిన వైదీశ్వరన్ కుమారుడిగా గుర్తించారు.


