అన్నానగర్ (చెన్నై): తిరువళ్లూరు జిల్లాలోని గుమ్మిడిపూండి–రెట్టంపేడు రహదారి పై ఆత్తుపాక్కం గ్రామం ఉంది. ఆర్యతమ్మన్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైందని గ్రామ పరిపాలనా అధికారి రమేష్ శనివారం ఉదయం గుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. ఆ సమయంలో, ఆలయ ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహం ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిదని వెల్లడైంది.
ఆమె ఎవరు? ఏ గ్రామానికి చెందినది అని తెలియదు. ఆమె గడ్డి తిన్నందున ఆమె నోరంతా గడ్డితో నిండి ఉంది. ఆకలితో గుడి గేటు వద్ద గడ్డి మొక్కలు తిన్నడం తో ఆ యువతి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. గుమ్మిడిపూండి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


