సాక్షి,చెన్నై: మాజీ కేంద్ర మంత్రి కుమార్తె విచక్షణ కోల్పోయారు. విధుల్లో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌పై చేయిచేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌పై దాడి చేసిన ఆరోపణలపై మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్విళి అళగిరిపై చెన్నై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అడయార్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ నడుస్తున్న కమర్షియల్ భవనానికి కయల్విళి యజమాని. ఆ బిల్డింగ్‌లోని లిఫ్ట్ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో, దానిని బాగు చేయాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ హర్షీన్ సింగ్ నేరుగా కయల్విళికి ఫోన్ చేసి కోరారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూలై 20న ఆమె నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వచ్చారు.
బ్యాంకులో మేనేజర్‌తో కయల్విళి వాగ్వాదానికి దిగారు. మాటల మధ్యలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అకస్మాత్తుగా లేచి మేనేజర్ చెంప చెల్లుమనిపించారు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ నమశ్శివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్‌ను దూషించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అడయార్ పోలీసులు కయల్విళిపై పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
On Camera, Ex-Union Minister's Daughter Slaps SBI Branch Manager In Chennai
Read more: https://t.co/Olg38adgA8 pic.twitter.com/rF9Rp9Ispj— NDTV (@ndtv) July 25, 2026


