‘‘ఏదైనా సరిగా లేదు అనిపించింది అనుకోండి..
న్యాయంగా, ధర్మంగా లేవని తోచిందనుకోండి...
దానిపై గొంతెత్తాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. చేయాలి’’
అమెరికా పౌర హక్కుల నేత, జార్జియా ప్రజాప్రతినిధి (1940– 2020) జాన్ లూయిస్ చేసిన వ్యాఖ్య ఇది. దీన్ని రియా ఆహిర్ అక్షరాలా చేసి చూపించింది. ఆ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై విద్యార్థుల ఉద్యమానికి జంతర్ మంతర్ కేంద్రబిందువైనప్పటికీ.. జెన్–జీ చైతన్యానికి, ఆ మాటకొస్తే ఉద్యమం మొత్తానికి సాక్షిభూతంగా నిలిచింది మాత్రం పోలీసు వ్యాన్‌ను ఆపుతూ నిలిచిన రియా ఆహిర్ ఫొటోనే అంటే అతిశయోక్తి కాదు.
ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన 27 ఏళ్ల రియా ముంబైకర్. మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా. ముంబైలో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌కు ఎదురెళ్లి రెండు చేతులతో అడ్డుకోవడం కేవలం ప్రతీకాత్మకమైన విషయం కానేకాదు. తప్పనిపిస్తే ఎవరినైనా నిలదీస్తాం. నిగ్గదీస్తాం అన్న జెన్–జీ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం! ‘‘కుడోస్ రియా ఆహిర్’’
– సాక్షి, నేషనల్ డెస్క్


