ఆందోళనల విరమణ  | cockroach protest called off after education minister resigned | Sakshi
Sakshi News home page

ఆందోళనల విరమణ 

Jul 26 2026 5:05 AM | Updated on Jul 26 2026 5:05 AM

cockroach protest called off after education minister resigned

నిరసనలు ఆపేస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ 

అన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుందని ప్రకటన 

మంత్రులతో ఫలవంతమైన చర్చల తర్వాత సీజేపీ సంయుక్త ప్రకటన 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో ఉద్యమించిన యువత ఆరంభించిన ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్‌ జనతా పారీ్ట(సీజేపీ) శనివారం ప్రకటించింది. నీట్‌ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తోపాటు ఆత్మహత్యలకు పాల్పడిన పరీక్షార్థుల కుటుంబాలకు తలో రూ.1 కోటి నష్టపరిహారం, జూన్‌ 20నాటి ఛలో సంసద్‌ ర్యాలీలో పోలీసులతో ప్రతిఘటించిన ఉద్యమకారులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తేసేందుకు మోదీ సర్కార్‌ సమ్మతి తెలపడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. 

ప్రభుత్వంతో జరిపిన నాలుగో దఫా చర్చలు ఫలవంతమయ్యాక సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మంత్రులతో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి శనివారం ఢిల్లీలోని ‘కాన్సిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’లో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రంకాలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో అశుతోష్‌ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీ, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉద్యమకారులపై నమోదైన కేసులను నాలుగు రోజుల్లోపు ఎత్తేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనలకు నేటితో ముగింపు పలుకుతున్నాం. 

జంతర్‌మంతర్‌ సహా అన్ని నిరసనవేదికల నుంచి కార్యకర్తలంతా ఇళ్లకు బయల్దేరండి’’అని అశుతోష్‌ కోరారు. హామీల అమలు, విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలపై సమీక్ష కోసం సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధులు నాలుగు వారాల తర్వాత మళ్లీ భేటీ అవుతారని అశుతోష్‌ వెల్లడించారు. తర్వాత జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఉద్యమం ముగిశాక కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడవద్దు అని సీజేపీ ప్రతినిధులు కోరారు. మంత్రి రాజీనామా, బాధితులకు నష్టపరిహారం, కేసుల ఉపసంహరణతోపాటు పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు వాళ్లు సూచించిన ఐదు పాయింట్ల చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది’’అని నడ్డా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement