కాక్రోచే అనుకుంటే.. కదం తొక్కింది! | Cockroach Movement Sparks Nationwide Protests | Sakshi
Sakshi News home page

కాక్రోచే అనుకుంటే.. కదం తొక్కింది!

Jul 26 2026 1:46 AM | Updated on Jul 26 2026 1:46 AM

Cockroach Movement Sparks Nationwide Protests

ఒక చిన్న వ్యాఖ్య... ఇంకో యాదృచ్ఛిక ఆలోచన!  

దేశం మొత్తాన్ని ఊపేసిన ఉద్యమానికి ఇదే నాంది! 

కళ్లు మూసి తెరిచేలోగా చినికి చినికి గాలి వానైంది. 

విద్యార్థుల్లో దాగిన ఆక్రోశానికి గొంతుకైంది... 

21వ శతాబ్దంలోనూ గాంధీ మార్గానికి తిరుగులేదని నిరూపించింది. 

అధికారం కొమ్ములు వంచి కేంద్ర మంత్రి రాజీనామాకు కారణమైంది!

ఒక్క మాట.. మహోద్యమంగా మారింది. ‘కాక్రోచ్‌’ పుట్టుకకు కారణమైంది.. ఈ ఏడాది మే 16న దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్య ఒకటి వైరల్‌ అయిపోయింది. దేశంలోని నిరుద్యోగ యువత బొద్దింకల్లా (కాక్రోచ్‌) మారారని సీజేఐ వ్యాఖ్యానించినట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారమైంది. తన ఉద్దేశం అది కాదని సీజేఐ తరువాత చెప్పుకున్నారు అది వేరే విషయం. కానీ...యువతను బొద్దింకలతో పోల్చారన్న విషయం.... మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదువు చదివి.. అమెరికాలోని బస్టన్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ రిలేషన్స్‌పై పీజీ చేస్తున్న 30 ఏళ్ల అభిజిత్‌ దీప్కేకు అంతగా రుచించలేదు.

అప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండటమో ఇంకో కారణమో తెలియదు కానీ... సీజేఐ వ్యాఖ్యపై వ్యాఖ్యానిస్తూ.... ‘‘బొద్దింకలన్ని ఒక్కటైతే ఏమవుతుంది?’’అని వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. ఇది కాస్తా జెన్‌–జీ గుండెలను నేరుగా తాకింది. ఇంకేముంది... రికార్డు సమయంలో లక్షల మంది ఫాలోవర్లు సిద్ధమైపోయారు. కాక్రోచ్‌ జనతా పార్టీ సోషల్‌ మీడియా హ్యాండిల్‌ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతగానంటే... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటూ వచి్చన భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను కూడా మించిపోయేంత! 

యువతలోని ఈ జోష్‌ అభిజిత్‌ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ... అప్పటికే నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో తలపట్టుకుని ఉన్న కేంద్రం మే 21న మారు పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్‌ హ్యాండిల్‌ను స్తంభింపజేసింది. ఇంకేముంది అగ్గి రాజుకుంది! మద్దతుదారులు  
‘Cockroach is Back’’, పేరుతో కొత్త హ్యాండిల్‌ను సృష్టించడం, గంటల్లోనే 280,000 కంటే ఎక్కువమంది ఫాలోవర్లు చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎక్స్‌ హ్యాండిల్‌ పునరుద్ధరణకు ఢిల్లీ హైకోర్టును నిరాకరించడం (మే 29వ తేదీ)తో ఇరుపక్షాల్లోనూ పంతం పెరిగినట్టు అయ్యింది. ఈ లోపుగానే ఒక పక్షం కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతుదారులపై రకరకాల ముద్రలు వేయడం మొదలుపెట్టారు.

ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటని అభిజిత్‌ను ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా జూన్‌ మొదటి వారంలో అభిజిత్‌ దేశానికి తిరి­గి వచ్చారు. ఆ వెంటనే జూన్‌ ఆరవ తేదీన నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నిరసనకు దిగారు. కొన్ని రోజుల తరువాత లడాఖ్‌ విద్యావేత్త, ఇంజినీర్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ కాక్రోచ్‌ జనతా పార్టీకి మద్దతివ్వడం, ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగిపోయాయి. వాంగ్‌చుక్‌ సుమారు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత రెండు రోజులకు అంటే జూలై 20న కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్‌ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జితో జెన్‌–జీ మొత్తం ఏకమైంది. 

ఈ దశలో కేంద్రం కూడా ఒక మెట్టు దిగి కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రంకాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మరో­వైపు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశమిస్తూ... ప్రశ్న పత్రాల లీకేజీలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులకు మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించా­రు. అయినా సరే.. అభిజిత్‌ దిప్కే వర్గం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతోనే ఉద్యమం ఆగుతుందని కుండబద్దలు కొట్టారు. 

దీంతోపాటు నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి నష్ట­పరిహారం చెల్లించాలని, ఛలో సంసద్‌లో విద్యార్థులపై లా­ఠీ­లు ఝళిపించిన పోలీసులపై చర్యలు, విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదన్న షరతులు పెట్టాయి. రెండు దఫాల చర్చల తరువాత ప్రధాన్‌ రాజీనామా మినహా మిగిలిన షరతులకు ఓకే చెప్పింది. అయినప్పటికీ ప్రధాన్‌ రాజీనామాపై కాక్రోచ్‌ జనతా పార్టీ పట్టు వీడలేదు. దీంతో ఎట్టకేలకు జూలై 25న ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచి్చంది. దీంతో ఉద్యమమైతే సమసింది కానీ... ముందేం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం! 
– సాక్షి, నేషనల్‌ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement