చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సుకు శనివారం తెల్లవారుజామున పెరంబలూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడానికి కొన్ని నిమిషాల ముందే డ్రైవర్ ఇబ్రహీం (63) అప్రమత‍్తమై బస్సును ఆపాడు. దీంతో అందులో ఉన్న 23 మంది ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
ఆ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి మదురై బయల్దేరింది. డ్రైవర్ ఇబ్రహీం మదురై జిల్లా మేలూరుకు చెందిన వ్యక్తి. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా మంగళమెడు సమీపంలోని అయన్ పెరైయూర్ గ్రామం వద్ద వెళ్తుండగా బస్సు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది.
నిద్రిస్తున్న ప్రయాణికులను లేపిన డ్రైవర్
డ్రైవర్ ఇబ్రహీం వెంటనే పొగను గమనించి బస్సును రహదారి పక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించి... నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి వెంటనే కిందికి దిగాలని చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు చేతికి దొరికిన సామాన్లు తీసుకుని బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రయాణికులు దిగుతున్న సమయంలోనే ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు మొత్తం భారీ మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న మంగళమెడు పోలీసులు, జాతీయ రహదారి గస్తీ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వెప్పూర్, పెరంబలూరు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.
దాదాపు 15 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చేసి, ఉదయం 7 గంటల కల్లా అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప చట్రం మాత్రమే మిగిలింది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లలేకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎదురువైపు లేన్‌లోకి వాహనాలను మళ్లించి అడ్డంకిని తొలగించారు. ఉదయం 7 గంటల సమయంలో ఎర్త్‌మూవర్ల సాయంతో బస్సును జాతీయ రహదారి నుంచి తొలగించారు.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడంలో అధికారులు సాయం చేశారు. ప్రయాణికులు తమ సామాన్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సును ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళమెడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


