ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఓ మహిళ ఇంక్ చల్లింది. ఉదయం నుంచి జంతరమంతర్ దగ్గర దీప్కే నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై సీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం జంతర్ మంతర్ దగ్గర మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దీప్కే ప్రసంగిస్తుండగా ఓ మహిళ ఆయనపై సిరా లాంటి ద్రవాన్ని విసిరింది. దీంతో గందరగోళం నెలకొంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
20 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో.. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులు పోలీసుల చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా జూన్ 28 నుంచి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు.. ఈ దీక్షలో ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని తెలిపారు.


