లక్నో: లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన డిగ్దిగా గ్రామానికి చెందిన నీలు సకాలంలో వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది..అత్యంత బాధాకరమైన ఆ క్షణమే ఆమె జీవితానికి కొత్త లక్ష్యాన్ని చూపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఉత్తీర్ణత సాధించి తన సాకారం వైపుగా తొలి అడుగు వేసింది.
నీలు 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించడంతో వారి కుటుంబ ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, ఈ కష్టాలు, నష్టాలు ఆమెను ఆమెను కృంగ దీయలేదు. వైద్యం అందక పేదరికం వల్ల ఎవరూ తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ఆమె నిశ్చయించుకుంది. మరోవైపు కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలైన ఆమె తల్లి, ఆసుపత్రి లోనూ, ఇటు గృహ సహాకురాలిగా పనిచేస్తుంది. కూతుళ్ల చదువును మాన్పించి, వారికి పెళ్లిళ్లు చేయమని బంధువులు, ఇతరులుఎంత ఒత్తిడి చేసినా బిడ్డల్ని చదివించేందుకు నిర్ణయించుకుంది.
తండ్రి మరణంతో సంకల్పం
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తండ్రికి సరైన వైద్యం అందించలేకపోయామని, చివరికి అనారోగ్యంతో కన్నుమూశారని నీలు చెప్పింది. పేదరికంతో సరైన చికిత్స అందించలేక నాన్నను కోల్పోయాను. అందుకే పేదరికం వల్ల మరే కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదని ఆ రోజే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను అని నీలు తెలిపింది.
అట్టడుగు వర్గాల బాలికల కోసం స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SHEF) నడుపుతున్న ప్రేరణ బాలికల పాఠశాలలో నీలు తన విద్యను ప్రారంభించి, ఆ తర్వాత 11, 12 తరగతుల కోసం స్టడీ హాల్ పాఠశాలలో స్కాలర్‌షిప్ సంపాదించింది. కష్టపడి చదివి నీట్‌లో ఉత్తీర్ణత సాధించి తన కల వైపు మొదటి పెద్ద అడుగు వేసింది. పట్టుదలతో చదివి నీట్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసింది. ఈ ఏడాది సిబిఎస్‌ఇ క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో నీలు 94 శాతం మార్కులు సాధించింది. . ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించేందుకు సిద్ధ మవుతోంది. భవిష్యత్తులో కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) లో స్పెషలైజేషన్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సరసమైన ధరకే వైద్యం అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
నీలు అకడమిక్ ప్రతిభను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'వహానీ స్కాలర్‌షిప్' లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 మంది మాత్రమే ఎంపికైన తుది జాబితాలో నీలు చోటు దక్కించుకుంది. ఈ స్కాలర్‌షిప్ ఆమె వైద్య విద్యకు అయ్యే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను భరిస్తుంది.
స్ఫూర్తిగా నిలిచిన నీలు
స్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఊర్వశి సాహ్ని మాట్లాడుతూ... సరైన అవకాశాలు, సాయం లభిస్తే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చెప్పడానికి నీలు విజయమే నిదర్శనమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షి బహదూర్ కూడా నీలును ఎంతో కష్టపడే, పట్టుదల గల విద్యార్థిగా అభివర్ణిస్తూ, ఆమె విజయం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది


