నీట్‌ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌ కుర్రాడు..! ఆమె మరణమే.. | NEET UG 2026 Topper Aryan Gupta Shares Success Story | Sakshi
Sakshi News home page

నీట్‌ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌ కుర్రాడు..! ఆమె మరణమే..

Jul 17 2026 12:12 PM | Updated on Jul 17 2026 12:26 PM

NEET UG 2026 Topper Aryan Gupta Shares Success Story

NEET UG 2026 Toppers List: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ) రీటెస్ట్‌ ఫలితాలు గురవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 11 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. వారిలో మొత్తం 138 మందికి 690కి పైగా మార్కులు రాగా, 19 మంది 700పైగా మార్కులు సాధించి,  గొప్ప మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్రాల వారిగా చూస్తే వారిలో ఆల్‌ ఇండియా 1వ ర్యాంకుతో పంజాబ్‌కు చెందిన ఆర్యన్‌ గుప్తా టాపర్‌గా నిలిచాడు. 

అతడు నీట్‌ యూజీ పరీక్షలో మొత్తం 720 మార్కులకు  715 మార్కులు సాధిచడం విశేషం.  ఈ మేరకు ఆర్యన్‌ మాట్లాడుతూ..నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కల నిజమైనట్లుగా అనిపించిందన్నాడు. తన తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే కావడంతో ఈ సక్సెస్‌ వాళ్లకెంతో గర్వంగా ఉందన్నారు.  తాను ప్రిపరేషన్‌ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరించినట్లు తెలిపాడు. చదువకోవడానికే ఎక్కువ సమయం కేటాయించానని చెప్పాడు. 

రోజుకు సుమారు 16 నుంచి 17 గంటలు చదివినట్లు వెల్లడించాడు. ఒక్కోసారి అస్సలు నిద్రపట్టేది కాదని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా ముందుకు సాగానని చెప్పాడు. ఈ విజయం తన తన చిన్ననాటి నష్టం, తన కెరీర్‌ ఆశయాలను నుంచి పుట్టుకొచ్చిందని చెప్పాడు. తాను మూడో తరగతిలో ఉండగా అమ్మమ్మ కేన్సర్‌తో చనిపోవడంతో ఈ రంగంలో పనిచేయాలని ఆ రోజే స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నానని చెప్పాడు. 

ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా తన పేరెంట్స్‌, ఉపాధ్యాయులు, తనను నమ్మిన ప్రతిఒక్కరిదని అన్నాడు. అలాగే తాను జీవితంలో చేయాల్సింది చాలా ఉందని, ప్రస్తుతం తాను ఆంకాలజిస్ట్‌ కావలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా అతడి కుటుంబం ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. అంతేగాదు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, శిరోమణి అకాలీ దళ్ నాయకుడు విక్రమ్ సింగ్ మజీతియాతో సహా పలువురు రాజకీయ నాయకుల నుంచి కూడా ఆర్యన్‌కి అభినందన సందేశాలు అందాయి.

అలా జరగడంతో చాలా ఏడ్చా..
ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో, మొదటి పరీక్ష తర్వాత నీట్ యూజీ 2026 రద్దు కావడంతో తాను కూడా మొదట్లో తీవ్రంగా కుంగిపోయినట్లు తెలిపాడు. ఆ సమయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యానని అన్నారు. ఇలా కేవలం నా ఒక్కడికే కాదని, అందరిదీ ఇదే పరిస్థితని అంగీకరించి, అధిగమించే ప్రయత్నం చేశానని అన్నాడు. అయితే తాను రెండో ప్రయత్నంలో తన ప్రతిభను మెరుగుపరుచుకుని అగ్రస్థానంలో నిలవగలిగానంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆర్యన్‌ గుప్తా. 

 

(చదవండి: కుమారుడి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..! కన్నీటి సంద్రంలో తండ్రి)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement