పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన' | Details Of Cultivable Wild Fruit Species Erra Jana | Sakshi
Sakshi News home page

పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన'

Jul 17 2026 8:56 AM | Updated on Jul 17 2026 9:20 AM

Details Of Cultivable Wild Fruit Species Erra Jana

అడవి పండ్లు–10

‘సాగుబడి ప్లస్‌’ పేజీలో ప్రతి శుక్రవారం అడవి పండ్ల జాతుల విశేషాలతో ధారావాహిక

ఎర్ర జాన కూడా ఉష్ణ మండలపు ఆకులురాల్చే చెట్ల తెగకు సంబంధించినది. ఈ చెట్లు 5–8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు, పూలు ఇంచు మించు ఫాల్సా ఆకులను పోలి ఉంటాయి. కొమ్మలు కిందికి సాగి ఉంటాయి.

ఈ చెట్లు నలమల అడవి అంతటా లేవు. మల్లాపూర్, అప్పాపూర్‌ పోయే దారిలో తారసపడుతాయి. ఎర్ర జాన ఎక్కువగా ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ మొదలు చైనా వరకు ఉంటాయి. యున్సోవ్, మలేషియా, మైన్మార్, లాహోస్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా తదితర దేశాలు వీటి స్థలాలు. ఈ చెట్లు దాదాపు సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో కూడ ఆటు పోట్లను తట్టుకొని పెరుగుతాయి.

  • తెలుగు: ఎర్ర జాన
    బెంగాలీ: ధమిన్‌
    మరాఠీ: థమన్‌
    మలయాళం: చడచి, దనౌని
    ఇంగ్లీష్‌: థమన్‌
    కన్నడ: బుటలె
    గుజరాతీ: థమన్‌
    తమిళం: వృక్షం, అన్నం
    హిందీ: థమన్, కహ్‌ రాచి
    సంస్కృతం: దన్‌ వృక్షం అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది.

  • పూత: మార్చి– ఏప్రిల్‌

  • పండ్లు: మే– జూన్‌ 

    ఉపయోగాలు...

  • ఈ చెట్ల అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. ఎర్ర జాన పండ్ల పై పొట్టు ఎరుపు– కాషాయ వర్గం కలిగి ఆకరణీయంగా ఉంటాయి.

  • పండ్లలో ఒక గింజ, రెండు గింజలు, కొన్నిటిలో మూడు, నాలుగు గింజలు కూడా ఉంటాయి.

  • గింజలపై ఉండే పలుచటి పొర రుచికరంగా తీపిదనం కలిగి ఉంటుంది. ఈ పండ్లను చెంచులు ఇష్టంగా తింటారు.

  • ఆకులను పశువులు, జీవాలు ఇష్టంగా తింటాయి. కలపను చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు, ఇతర కట్టె వస్తువుల తయారీలో వాడవచ్చు.

  • వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది.

  • బెరడు నుండి కషాయం చేసి, దాన్ని అనేక రుగ్మతలను ముఖ్యముగా పుండ్లు నయం చేయటానికి, వాత, పిత్త, కఫాలను తగ్గించటానికి వైద్యంలో వాడతారు.

  • కడుపులో మంట పోటానికి ఈ బెరడు ఎంతో ఉపయోగపడుతుందని చెంచులు చెప్పారు.

  • ఎర్ర జాన పండ్లలో సూక్ష్మ ధాతువులు, ముఖ్యంగా విటమిన్లతో పాటు యాంతోసైనిన్స్‌, ఫినాల్స్, ప్లేవనైడ్స్‌ మొదలగునవి ఉంటాయి.

  • పండ్లలో ఓ మోస్తరు యాంటిఆక్సిడెంట్స్‌ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

  • వ్యవసాయం పంటలు, చెట్లతో కలిపి (ఆగ్రో–ఫారెస్ట్రీ) పెంచదగిన అనువైన చెట్టు.

  • ఎన్నో ఉపయోగాలు కలిగిన ఈ చెట్ల జాతిని అభివృద్ధి ఎంతో అవసరం.

  • ఎర్ర జాన చెట్లపై తగిన పరిశోధనలు జరిపి పల్లపు ప్రాంతాల్లో వీటి ఉనికిని చాటాలి.

  • తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, పోషకలోపాన్ని తగ్గించటంలో ఎంతో ఉపయోగపడగలదని ఆశించవచ్చు.


- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

  • నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement