breaking news
pantangi RamBabu
-
సూపర్ ఫాస్ట్ కంపోస్టర్!
సేంద్రియ వ్యర్థాలను కేవలం 8 గంటల్లో కంపోస్టు ఎరువుగా మార్చే ఆధునిక టెక్నాలజీని బెంగళూరుకు చెందిన వేస్ట్ ఈజ్ గోల్డ్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇంత సూపర్ ఫాస్ట్‌గా పోషకవంతమైన కంపోస్టు తయారు చేయగల మరో సంస్థ లేదు. 20 కేజీల నుంచి 10 టన్నుల చెత్తనైనా కేవలం ఎనిమిది గంటల్లో ఎటువంటి హానికరమైన వాయువులను వెలువరించకుండా కంపోస్టుగా మార్చేస్తోంది ఈ సంస్థ రూపొందించి గోల్డ్ కంపోస్టర్. ‘సేంద్రియ చెత్తను అత్యంత వేగంగా కంపోస్టుగా మార్చే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని, బయోరియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకునే నాచురల్ బయో మెకానికల్ ప్రాసెస్‌ను అనుసరిస్తున్నాం. టన్నుల కొద్దీ చెత్తనైనా ఒక్క రోజులోనే ఎరువుగా మార్చేస్తాం’ అంటున్నారు ఈ స్టార్టప్ అధినేత తివారి. ‘అధికంగా వేడిని ఉత్పత్తి చెయ్యకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందు వల్ల మిథేన్ వంటి హానికారక వాయువులు వెలువడకుండా చూస్తున్నాం. దీని వల్ల వ్యర్థాలను కంపోస్టుగా మార్చే పనిలో కాలుష్యం లేకుండా పోయింది. ఆక్సిజన్‌ను ఉపయోగించే సూక్ష్మజీవరాశిని, బయో రియాక్టర్‌ను ఏరోబిక్ డీకంపోజిషన్ పద్ధతిలో వాడటం వల్ల ఇది సాధ్యపడుతోంద’న్నారాయన. మేం తయారు చేసే కంపోస్టును తిరిగి మళ్లీ ఏ ప్రాసెసింగ్ చెయ్యాల్సిన అవసరం లేదని, నిల్వ చేసుకోవచ్చు. లాండ్‌స్కేపింగ్ కోసమైతే అదే రోజు వాడుకోవచ్చు. వ్యవసాయం కోసమైతే 3 నుంచి 7 రోజులు మాగిన తర్వాత ΄÷లాల్లో వేసుకుంటే పోషకాలు పుష్కలంగా భూమికి అందుతాయ’న్నారు తివారి. వండిన ఆహార వ్యర్థాలు, సేంద్రియ తడి చెత్త, ఎముకలు, మాంసం వ్యర్థాలు, ఈకలు, గుడ్ల పెంకులు, కూరగాయ వ్యర్థాలు, లేత కొబ్బరి బొండాల డొప్పలు, పండ్ల తోటల వ్యర్థాలు, గడ్డి కత్తిరింపులు, టిష్యూ పేపర్, ఎస్టీపీ వ్యర్థాలు.. వంటి వేటినైనా సరే తమ గోల్డ్ కంపోస్టర్ ద్వారా సమర్థవంతంగా 8 గంటల్లో కంపోస్టుగా మార్చవచ్చని తివారి చెబుతున్నారు. ఇది నిజంగా గోల్డ్ కంపోస్టరే. ఎందుకంటే, పట్టణ వ్యర్థాలను సేకరించిన తర్వాత అందులోని కుళ్లే సేంద్రియ వ్యర్థాలను, కుళ్లని ΄్లాస్టిక్ తదితర వ్యర్థాలను వేరు చేయటం పెద్ద పని. ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టరే చేసేస్తుందని తివారి చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో 150 చోట్ల నెలకొల్పారు. 2,500 టన్నుల చెత్తను 1,200 టన్నుల కంపోస్టుగా మార్చేయటం కూడా జరిగిందట. అయితే ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. పదేళ్ల ప్రయాణం, ప్రయాస దీని వెనుక ఉంది అన్నారు తివారి. ఈ గోల్డ్ కంపోస్టర్లను నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వార్డులు, గేటెడ్ కమ్యూనిటీలు, అ పార్ట్మెంట్ల దగ్గర నెలకొల్పి ఎక్కడికక్కడే సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చేస్తే.. నగరాలు, పట్టణాల మూలంగా చెత్త కొండలుగా పోగుపడే సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. పార్కులకు, ఇంటిపంటలకు, పంట ΄÷లాలకు కూడా సిటీ కంపోస్టు పెద్ద పరిమాణంలో అందుబాటులోకి వస్తుంది. ఆల్ ద బెస్ట్ టు గోల్డ్ కంపోస్టర్! -
ట్రీ ఆఫ్ లైఫ్
కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి. కొబ్బరి ఒక చక్కని ఆహారం. ఆరోగ్యదాయకమైన కొబ్బరి నీరును, అద్భుతమైన నూనెను అందించే గొప్ప పంట. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో జీవనో పాధిని అందిస్తుండటం వలన దీన్ని ‘జీవన వృక్షం (ట్రీ ఆఫ్ లైఫ్)’గా పరిగణిస్తారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా ఎల్ (అరేకేసి). కొబ్బరిని ఆహారంగా, ఆథ్యాత్మిక సాధనంగా, పానీయంగా, ఔషధ విలువలున్న నూనెగా ఉపయోగపడుతోంది. పీచుగా అనేక ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో సుమారు కోటి కుటుంబాలు కొబ్బరిని తమ ప్రాథమిక ఆహారంగా, ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా సాగు చేస్తున్న, ఉపయోగించబడే చెట్టుగా మారింది. కొబ్బరి గానుగ నూనెను వంటకు వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో వండర్ ట్రీ ఆఫ్ లైఫ్‌పై స్పెషల్ ఫోకస్...కొబ్బరి ఆధారిత వ్యవసాయ విధానం తరతరాలుగా అభివృద్ధి చెందిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధ ఉదాహరణ. కొబ్బరి చెట్లు ఇంటి పంటల్లో/తోటల్లో ముఖ్యమైన భాగాలు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవటం అనేక దేశాల్లో సుదీర్ఘ కాలపు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంటి తోటలలోని కొబ్బరి చెట్లు ఆ కుటుంబానికి జీవనాధార వ్యవస్థగా మారాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇలా చెబుతోంది: కొబ్బరి తదితర పంటల వైవిధ్యంతో కూడిన ఇంటి/పెరటి పంటలు రైతు కుటుంబం ప్రాథమిక అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఉ పాధి భద్రత కల్పిస్తుంది. ప్రతికూల వాతావరణ విపత్తులను తట్టుకునే శక్తిని ఇంటి/పెరటి పంటలు మెరుగుపరుస్తాయి. ఇందుకోసం పెరటి తోటల్లో అనేక పంటలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకం కూడా కలిసి ఉంటుంది. 15వ శతాబ్దపు మళయాళ కావ్యం ‘కృషి గీత’లో కేరళలో మధ్యయుగపు పర్యావరణ అనుకూల సాగు వ్యవస్థల ప్రస్తావన ఉంది. కొబ్బరి ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ఇందులో ప్రముఖంగా పేర్కొనటం విశేషం. కొబ్బరి సేద్యంలో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు...నాణ్యమైన, స్వచ్ఛమైన లేక జన్యు స్వచ్ఛత కలిగిన కొబ్బరి నారు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకొని నమ్మ దగ్గ నారు మొక్కలను ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యానశాఖ విభాగం వారి గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సేకరించుకొని జాగ్రత్త పడాలి. సంవత్సరం అంతా పండే పంట కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా నారు మొక్కలను శ్రద్ధగా ముందు జాగ్రత్తతో సేకరించుకొని నాటుకోవాలి. పచ్చి కొబ్బరి బోండం (చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అంటే నారింజ రంగు గల ΄÷ట్టి రకం) తెగులును తట్టుకునే/తెగులును ఎదుర్కొనే (కల్ప రక్ష, కల్ప శ్రీ కల్ప శంకర) రకాలను, కురిడి కొబ్బరి రకం (లక్షద్వీప్ మైకో) మొదలైనవి మేలు.నాటేందుకు అనుకూల నేలలు...కొబ్బరి సాగులో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వెలుతురు బాగా ప్రసరించాలి. కొబ్బరికి అనుకూలమైన నేలలను ఎంచుకుంటే గాలి, వెలుతురు ప్రసరణ బాగా జరిగి నత్రజనిని, కర్బనాన్ని, ఆక్సిజన్‌ను బాగా గ్రహించి పంటలు బాగా ఎదగడానికి సహకరిస్తుంది. చెట్టు ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరగాలంటే ఖాళీ భూముల్లో సాధ్యమైనంత వరకు మొక్క నాటడం ఉత్తమం. కేరళలో ఎక్కువగా కొబ్బరి నారు మొక్కలను వెలుతురు కోసం పెద్ద చెట్ల కింద నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు ప్రసరణ సక్రమంగా అందక లేత మొక్కలు చీడ పీడల తాకిడికి తీవ్రంగా గురి అవుతూవుంటాయి. అంతేగాక ఈ చెట్లు పూత పూయడానికి ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తాయి కూడా! కొబ్బరి నారు మొక్కల్ని నీరు సరిగ్గా పారని భూముల్లో నాట కూడదు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో పోషకాలు సరిపడక వేర్ల శ్వాసక్రియ సక్రమంగా ఉండదు. ఒక వేళ ఈ పరిస్థితులలో పెరిగినా ఎదుగుదలలో ఆటంకం ఏర్పడి కాయల దిగుబడిలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఎదిగెందుకు తగిన తేమ అవసరం. అదే తరుణంలో పాదులో నీరు నిలచే పరిస్థితిని తట్టుకోలేవు. కొబ్బరి చెట్లు ఎదగడానికి ముందుగానే మంచి వెలుతురు, గాలిలోని మూలకాలు బాగా గ్రహించేందుకు సహకరించే భూసారం అవసరం. అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి.పంటకు కావలసిన భూభౌతిక వనరులు...నిర్థిష్టమైన నియమం ప్రకారం ఒక సెంటు భూమి(40 చదరపు మీటర్ల)లో ఒకే ఒక్క కొబ్బరి నారు మొక్కను నాటే ఏర్పాటు చేసుకోవాలి. రైతులందరు కొబ్బరి సాగును ఏక పంటగా పెంచేటపుడు అన్ని మొక్కలకు 7.5మీ. “ 7.5 మీ.లు, ΄÷ట్టి రకాల మొక్కలను 7.0మీ గీ 7.0మీ. ల ఖాళీ స్థలం ఉండే విధంగా నాటాలి. పెరటి తోటలలాగా ఎక్కువ పంటలను కలిపి పండించే సమయంలో చెట్లకు గాలి బాగా సోకే విధంగా తక్కువ మొక్కలు నాటాలి. రాజీ పడకూడదు. నాటే సమయంలో తక్కువ స్థలం కేటాయిస్తే గాలి ఆడక చెడు వాసన ప్రబలి చీడపీడలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతర పంటలను అనుబంధంగా పండించడం వల్ల చీడపీడల నియంత్రణ బాగా జరుగుతుంది. తోటలో పక్షులు వాలడానికి పంగ కర్రలు, సన్నని కాడ కలిగినటువంటి పూల మొక్కలను గుంపులుగా పెంచితే చీడపీడల నెదుర్కొనేలా పర్యావరణ రక్షణ సేవలు పొందవచ్చు. కొబ్బరి తోటల్లో కొమ్ము పురుగును నివారించేందుకు కొబ్బరి ఆధారిత వివిధ పంటల సాగు ఏక పంటగా కొబ్బరి చెట్ల సాగుకంటే బాగా అనుకూలంగా ఉన్నట్లు రూఢి అయ్యింది.పంట రక్షణ...నారు మొక్కల జీవక్రియ పెంచడానికి, నారు మొక్కలను నాటిన తర్వాత స్యూడోమొనాస్ను నాలుగు ఏడు, పది నెలల్లో 50 గ్రా. చొప్పున వేస్తూండాలి. మొక్కల్ని నాటేటప్పుడు 100 గ్రాముల స్యూడోమోనాస్ ΄÷డితో ద్రావణం చేసి వేరు మొక్కలను అందులో ముంచి నాటాలి. నాటిన మొక్కల హద్దుల వెంబడి గ్లైరిసీడియా మొక్కలను పెంచుతూ, వాటి ఆకులను కత్తిరించి మొక్కల పాదులలో మల్చింగ్ వేయడం వల్ల భూసారంలో మేలు చేసే సూక్ష్మజీవులే గాక సేంద్రియ పదార్థం వల్ల భూభౌతికంగా రసాయనికంగా, జీవనసంబంధమైన ఎరువులు వృద్ధి అవుతాయి. సేంద్రియ సూక్ష్మ పోషకాలు కూడా అభివృద్ధి అయి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఎరువు తయారవుతూండడం వల్ల పంటలకు పోషకాలు (బయో ఎంజైములు) చెట్ల ఎదుగుదలకు బాగా అనుకూలిస్తాయి. బాగా మగ్గిన వర్మికంపోస్టు (10గ్రా. ఒక చెట్టుకు) లేక పశువుల ఎరువు (ఒక కిలో / చెట్టుకు) వేప చెక్క (2కిలోలు / చెట్టుకు) (ట్రైకోడెర్మా కలిపి (250 గ్రా/ చెట్టుకు) లేత కొబ్బరి మొక్కకు నాటిన తొలి దశలో ఎరువుగా ఉపయోగించుకోవాలి.జీవవ్యర్థాల పునరుత్పత్తి వినియోగం...ఏప్రిల్ – మే, సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో జనుము, జీలుగ పంటల ఆకులను పచ్చి రొట్ట ఎరువుగా చెట్టుకు 100 గ్రాములు పాదులలో వేసినట్లయితే వాతావరణ సంబంధ నత్రజని మాత్రమే గాక కాల్షియం: నత్రజని నిష్పత్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. పచ్చి రొట్ట ఎరువును వేయడం వల్ల భూమి లోపలి ΄÷రలలోకి గాలి పుష్కలంగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి అవడం, తేమ కొరత ఉన్నా కూడా మొక్కలు నిలదొక్కుకుని పెరగడం గమనించవచ్చు.చెట్లకు నీటి పారుదల చాలా క్లిష్టమైన అంశం వేసవి కాలంలో తేమ కొరతను నివారించేందుకు చెట్టుకు 200 లీటర్ల నీటిని వారానికి ఒక్కసారి అందివ్వడం అతి ముఖ్యమైన విషయం. అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు బిందు సేద్యం అందిస్తూ వినియోగించ వలసిన నీటిని పూర్తిగా ఉపయోగించడం అన్నది మరొక విధానం. వర్షాకాలంలో కూడా తగిన విధంగా నీరు ఇవ్వాలి. కోస్తా తీరంలో సముద్రజలాల పారుదలకు వీలున్నప్పుడు 500ల గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో నాణ్యమైన వేప చెక్కను, పచ్చి రొట్ట ఎరువుగా పచ్చని ఆకులను చేర్చి వేసుకోవాలి. కొబ్బరి తోటల అభివృద్ధికో పథకంకొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల కోసం రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు సహాయం దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా ఉత్పాదకతను పెంపొందించటం కోసం కొబ్బరి బోర్డు 2025–26 సంవత్సరానికి గాను రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారుల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థ ద్వారా ఉత్పాదకత మెరుగుదలకు క్లస్టర్ ప్రాతిపదికన, బోర్డు నియమ నిబంధనలకు లోబడి రైతు భాగస్వామ్య విధానం ద్వారా ప్రస్తుత తోటల్లో ఉత్పత్తి, ఉత్పాదకతలను మెరుగుపరచడానికి కొబ్బరి బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులు / ప్రతి పాదన లు ఈ నెల 31 లోగా పం పాలి. కీలకమైన ఉత్పాదకాలు, అంతర పంటలు నాటడం, సామగ్రి, పచ్చి ఎరువు విత్తనాలు, మొక్కల రక్షణ రసాయనాలు మొదలైన వాటి ఖర్చులకు బోర్డు సహాయం వరుసగా రెండు సంవత్సరాలు అందించనుంది. కూలీల ఖర్చులు, ఇతర అద్దె సేవలు, మౌలిక సదు పాయాల అభివృద్ధి మొదలైన వాటికి ఈ పథకం వర్తించదు. ఆసక్తిగల రైతు బృందాలు 2025–07–31 ఉదయం 10.30 గంటల్లోగా అవసరమైన పత్రాలతో పాటు సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా ఇవ్వాల్సిన చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర కార్యాలయం, డోర్ నంబర్ 54–14/5–18ఎ, రోడ్ నెం.11, భారతి నగర్, నోవోటెల్ దగ్గర, రింగ్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా – 520008.పోషకాలమయం కొబ్బరి నూనె!కొబ్బరి నూనెను తల నూనెగానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ, పోషకాల నిలయమైన కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. మనుషుల ఆయుప్రమాణం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరి నూనెనే విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు సమాచారం ప్రకారం.. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విధానాల గురించి తెలు సుకుందాం.ఆరోగ్యపరమైన ప్రయోజనాలుకొబ్బరి నూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్ష న్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది కొబ్బరి నూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల ΄÷ట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి శరీర మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నూనెకు ఉంది.కొబ్బరి నూనెను వంటల్లో ఇలా వాడాలికొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్‌హీట్ కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చుకేకు వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25% తక్కువ కొబ్బరి నూనె వాడాలి పాప్‌కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్ మాదిరిగా బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు స్మూదీస్, సూప్స్, సాసుల్లో కలుపుకోవచ్చు ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చుపప్పు తాలింపులో వాడొచ్చు. ఆధారం: భారత ప్రభుత్వ సంస్థ ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు’. -
సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్‌స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్‌నగర్‌లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్‌ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్‌నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు -
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885 -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్‌ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్‌ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్‌ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్‌వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్‌షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్‌లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్‌కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్‌గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్‌గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్‌ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్‌లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్‌లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్‌లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్‌లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్‌ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్‌గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
ముళ్లు లేని బ్రహ్మజెముడు.. పశుగ్రాసంతో పాటు ఆహార పంటగా! పాలలో వెన్నశాతం పెరిగి
Spineless Cactus: ముళ్లులేని బ్రహ్మజెముడు కరువు పాంతాల్లో వేసవి పశుగ్రాస పంటగా ఉపయోగపడుతోంది. అతి తక్కువ నీటితోనే బ్రహ్మజెముడు మొక్క బతుకుతుంది. ఇతర ఏ ఇతర పశుగ్రాస పంటల కన్నా తక్కువ నీటితోనే బతకగలదు. మెక్సికో, జోర్దాన్ వంటి దేశాల్లో కరువు/ఎడారి ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగంగా మారిన ఈ పంట ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పుణే కేంద్రంగా పనిచేస్తున్న బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇందుకోసం విశేష కృషి చేస్తుండటం విశేషం. ఒక్కసారి నాటుకుంటే దశాబ్దాల తరబడి నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన తర్వాత అనంతపురం జిల్లాలో రైతులకు ఈ పంటను ‘సెర్ప్’ సహాయంతో నాలుగేళ్ల క్రితం పరిచయం చేశారు. బ్రహ్మజెముడు పశుగ్రాస పంట మాత్రమే కాదు, ఆహార పంట కూడా. దీని ఆకులను కూరగా వండుకొని కూడా తింటారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు ఇలా.. నాటే కాలం: వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు. స్థల ఎంపిక: నీరు నిలవని తేలికపాటి నేలలు అనుకూలం. ఏ ఇతర పంటలు పండని నిస్సారమైన సాగు భూములు, బంజరు భూములు, రాళ్ల భూములు, ఇసుక భూముల్లోనూ ముళ్లులేని బ్రహ్మజెముడు పెరుగుతుంది. 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తులో మడుల (బెడ్స్)ను సిద్ధం చేసి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు నాటాలి. ఆకులను నాటడానికి సిద్ధం చేయటం: కనీసం ఒక సంవత్సరం వయసున్న ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులనే కోసి, నాటుకోవచ్చు. నాటడానికి ముందు వాటిని నీడలో 15 రోజులు ఉంచాలి. కోసిన వెంటనే నాటకూడదు. వడపడి తేమ తగ్గిన తర్వాత నాటాలి. శుద్ధి చేసి నాటాలి: శిలీంద్ర తెగుళ్లు నివారించడానికి జాగ్రత్తవహించాలి. నాటడానికి ముందు ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలోద్రావణంలో ఆకులను ముంచిన తర్వాత నాటాలి. నాటే దూరం: సాళ్ల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2 మీటర్ల (667 మొక్కలు/ఎకరం) దూరంలో నాటాలి. ఆకును చెట్టు నుంచి కోసిన భాగం మట్టిలోకి వెళ్లేలా నాటాలి. ఎత్తుమడిపై ఈ ఆకుపై ఎండపడే విధంగా తూర్పు వైపు తిప్పి నిటారుగా ఉండేలా నాటండి. ఎరువు: నాటేటప్పుడు ఎకరానికి 2 టన్నుల చొప్పున బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో పాటు 60:30:30 ఎరువులు వేయండి. నాటిన ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకొని పశువులకు మేపవచ్చు లేదా తిరిగి నాటుకోవచ్చు. ∙నీటి నిర్వహణ: మొక్కలు (ఆకులు) నాటిన 10 రోజుల వరకు మొక్కలకు నీరు పెట్టవద్దు. తర్వాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు పోయాలి. మొదటి ఏడాది కలుపు తీసెయ్యాలి. ఆకుల దిగుబడి: నాటిన తర్వాత ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకోవచ్చు. కింది వైపు ఉండే రెండు, మూడు ఆకులు అలాగే ఉంచి ఆ పైన పెరిగిన ఆకులను చాకుతో కోయాలి. మేపటం: ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను చిన్న ముక్కలుగా కోసి మేకలు/గొర్రెలు/పశువులకు ఇతర పచ్చి మేతకు బదులుగా 30% మేరకు తినిపించవచ్చు. చౌడు, నల్ల భూములు పనికిరావు! పశుగ్రాసం కొరతను అధిగమించడానికి పశువులు, గొర్రెలు, మేకలు పెంచుకునే కరువు ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులతో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగు చేయిస్తున్నాం. నీటి ఎద్దడి ఉండే ప్రాంత భూముల్లో ఈ మొక్కలు నిశ్చింతగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండే నల్ల నేలలు, చౌడు భూముల్లో ఈ మొక్కలు పెరగవు. 2018 నుంచి అనంతపురం జిల్లాలో 82 మంది రైతులకు ముళ్లులేని బ్రహ్మజెముడు నాటిస్తున్నాం. వీటి ఆకులు నాటితే చాలు. పుణే లోని బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి 4 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను తెప్పించి ‘సెర్ప్’ ఆధ్వర్యంలో రైతులకు పంచాం. ముళ్లులేని బ్రహ్మజెముడును మార్చి వరకు నాటుకోవచ్చు. నాటుకోవడానికి ఆకులు కావాలనుకునే రైతులు సంప్రదించవచ్చు. టిష్యూకల్చర్ పద్ధతిలో నర్సరీ పెంచుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇస్తాం. – సురేష్ (99892 04816), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధి, అనంతపురం ఎండాకాలంలో ఏపుగా పెరుగుతుంది ముళ్లులేని బ్రహ్మజెముడును మూడేళ్ల క్రితం వేసవిలో నాటాను. ఒక ఎకరంలో ఎత్తుమడులు నాటాను. 5 ఎకరాల జామ తోట చుట్టూతా అడుగు ఎత్తున సరిహద్దు గట్టు వేసి దానిపైన కూడా నాటాము. ఒక సంవత్సరం పాటు 15 రోజులకు ఒకసారి నీరు పోశాం. తర్వాత నుంచి నీరు పోయటం లేదు. మూడేళ్లకు ఇప్పుడు 6 నుంచి 8 అడుగుల ఎత్తు పెరిగాయి. ఈ మొక్కలు వర్షాకాలంలో పెద్దగా పెరగవు. ఎండాకాలంలో ఏపుగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండకూడదు. ఎంత ఎత్తు మీద అంత మంచిది. ఒక సంవత్సరం పెరిగిన తర్వాత నుంచి బ్రహ్మజెముడు ఆకులు కోసి, ముక్కలు చేసి.. ఆవులు, గేదెలతో పాటు 100 పొట్టేళ్లకు కూడా ఇతర పశుగ్రాసం లేనప్పుడు మేతగా వేసేవాళ్లం. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు మంచి పశుగ్రాసం. పశువులు ఏవైనా ఇష్టంగా తింటాయి. ఆవుల పాలలో వెన్న 1–2% వరకు పెరిగింది. రైతులు కొందరు ఇంతకు ముందే ఈ ఆకులను తీసుకెళి నాటుకున్నారు. ఆకును రూ. 20కి ఇస్తున్నాను. – అలవల వెంకటేశ్వర రెడ్డి , ఫోన్: 90006 16717, ముళ్లులేని బ్రహ్మజెముడు రైతు, గుత్తి, అనంతపురం జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: Sagubadi: తినడానికి పనికొచ్చేదని అప్పట్లో తెలీదు.. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం... Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్‌టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
‘ప్రకృతి’ పరిశోధనలకు పెద్ద పీట
ఆహారంతో పాటు మనం తింటున్న రసాయనాలే క్యాన్సర్ తదితర మహమ్మారి జబ్బుల్ని కలిగిస్తున్నాయని మీకు తెలుసా? కలుపు మందు తయారీ కంపెనీపై అమెరికన్ ప్రజలు 9 వేలకు పైగా నష్టపరిహారం కేసులు వేశారని మీకు తెలుసా? రసాయనిక అవశేషాల్లేని, రోగ కారకం కాని స్వచ్ఛమైన ఆహారం.. అంటే ‘అమృతాహారం’ తీసుకునే వారు బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని తెలుసా? అటువంటి అమృతాహారం రానున్న కొద్దేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలన్న మహాయజ్ఞం ప్రారంభమైంది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విప్లవాన్ని ప్రతి గ్రామానికీ, ప్రతి రైతుకూ, ప్రతి పొలానికీ విస్తరింపజేయడానికి దార్శనికతతో రాచబాటలు వేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల భాగస్వామ్యంతో వచ్చే 7–8 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్నీ దశలవారీగా ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించడానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికతో కదులుతున్నారు. బృహత్తరమైన ఈ కలను సాకారం చేసుకోవడానికి ఈ నెల 7న తొలి అడుగు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిశోధన, అధ్యయన అకాడమీని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక తోడ్పాటుతో పులివెందులలో ప్రారంభించారు. పశుసంపదపై పరిశోధనకు గతంలో అత్యున్నత వసతులతో ఏర్పాటు చేసిన ‘ఐజి కార్ల్’ ఆవరణలో (‘ఇండో–జర్మన్ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ – ఐజిఎఎఆర్ఎల్–‘ఐజి ఆర్ల్’గా మార్చారు.) ఇది ఏర్పాటైంది. ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పరిశోధన చరిత్రలోనే అదొక సుదినం. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6,30,000 మంది రైతులు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. ఈ కృషికి మెచ్చిన జర్మనీ ప్రభుత్వం ఐజి ఆర్ల్ నెలకొల్పటానికి రూ.174 కోట్ల గ్రాంటు ప్రకటించటం విశేషం. పరిశోధనలకు, రైతు శాస్త్రవేత్తల శిక్షణతో పాటు దేశ విదేశీ శాస్త్రవేత్తలకు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, 365 రోజుల పంటల సాగు వంటి పలు రైతు ఆవిష్కరణల వెనుక శాస్త్రీయత, ఎదుర్కొంటున్న సవాళ్లపై పరిశోధనా పత్రాలను వెలువరిస్తుంది. రాష్ట్రంలోని ఇతర 25 జిల్లాల్లోని 7 జిల్లాల్లో ఐజి ఆర్ల్కు అనుబంధ పరిశోధన, అధ్యయన కేంద్రాలను నెలకొల్పుతారు. మిగతా జిల్లాల్లోనూ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వైవిధ్య పంటలు, తోటల సరళికి అనుగుణంగా మెట్ట, మాగాణి భూముల్లో ప్రకృతి సేద్య నమూనాలపై పరిశోధనలు చేస్తారు. ఆర్బీకే స్థాయిలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులను ఎంపిక చేసి, ఐజి కార్ల్‌లో వారికి మూడేళ్ల పాటు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చి, వారి జ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అధికారిక గుర్తింపుగా సర్టిఫికెట్లు ఇస్తారు. రాష్ట్రంలో 10,800 రైతు భరోసా కేంద్రాలు రైతులకు గ్రామస్థాయిలో చేదోడుగా ఉంటున్నాయి. ప్రతి ఆర్బీకేలో ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన సర్టిఫైడ్ రైతు శాస్త్రవేత్తను నియమించడం ద్వారా స్థానికంగా రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఆర్బీకే ద్వారానే ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను సమకూర్చుతారు. వీటిని సముచిత ధరకు విక్రయించుకునేందుకు సైతం ఆర్బీకే వేదికగా నిలుస్తుంది. ఆ విధంగా మిగతా రైతులు సైతం రసాయనాలను పూర్తిగా వదిలేసి, తనకున్న మొత్తం పొలాన్ని దశలవారీగా మూడేళ్లలో ప్రకృతి సేద్యంలోకి మళ్లించడం వీలవుతుంది. మన రైతు శాస్త్రవేత్తల అనుభవాలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చక్కని ఆచరణాత్మక అపూర్వ పాఠాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఇందుకోసం లక్ష మంది సర్టిఫైడ్ ప్రకృతి రైతు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే విధంగా, వచ్చే ఐదేళ్లలో కనీసం 200 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణమైన భవనాలు సిద్ధంగా ఉండటంతో ‘ఐజీ ఆర్ల్’ ఈ ఖరీఫ్ నుంచే పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏపీ ప్రభుత్వ ప్రకృతి సేద్య విస్తరణ రోడ్‌మ్యాప్‌లో మరో ముఖ్య అంకం ఏమిటంటే... ఈ ఆవరణలోనే వచ్చే ఏడాది కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించటం. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్డీ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం ఆఫర్ చేయనుంది. సీఎం జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో వ్యవస్థీకృతం అవుతున్న ఐజి ఆర్ల్, ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) ఉపాధ్యక్షులు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్ అయిన టి.విజయకుమార్ పర్యవేక్షణలో వేరూనుకోనుంది. వ్యవసాయ విద్య, పరిశోధనలను ప్రకృతి బాట పట్టించి కొత్త పుంతలు తొక్కించాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పాన్ని భారత ప్రభుత్వం సైతం గుర్తించి ప్రోత్సహిస్తుండటం కలిసి వచ్చింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశు పరిశోధన, విస్తరణ సంస్థలు సైతం ప్రకృతి సేద్యంపై దృష్టి సారించటం శుభసూచకం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
జీవ భద్రతకు ‘జన్యు సవరణ’ కూడదు!
‘జన్యు మార్పిడి’ చేసిన (జెనిటికల్లీ మాడిఫైడ్–జీఎం) వంగ డాల ఉత్పత్తి, జన్యు మార్పిడి ఆహారోత్పత్తులకు సంబంధించి మన దేశంలో కఠినమైన జీవ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యాన్నీ, రైతుల జీవనో పాధినీ, పర్యావరణాన్నీ వెనక్కి తీసుకోలేని రీతిలో ప్రభావితం చేయగలిగినదై ఉండటం వల్లనే మనం పటిష్ఠమైన జీవ భద్రతా చట్టం రూపొందించుకున్నాం. మన దేశంలో ఇప్పటికి ప్రభుత్వ అనుమతి పొందిన ఏకైక జీఎం పంట బీటీ పత్తి మాత్రమే. జీవ భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బీటీ వంగ, బీటీ ఆవాలు తదితర జన్యు మార్పిడి వంగడాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇన్నాళ్లూ అన్ని రకాల ‘జన్యు మార్పిడి’ పంటలకు వర్తించే కఠిన జీవ భద్రతా నిబం ధనల పరిధి నుంచి కొన్ని రకాల ‘జన్యుపరంగా సవరించిన’ (జీనోమ్ ఎడిటెడ్) పంటలను పూర్తిగా మినహా యిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీచేయటం పట్ల నిపుణులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1989 నిబం ధనల ప్రకారం... జన్యు మార్పిడి సాంకేతికతలకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర పర్యావరణ శాఖకు అనుబంధంగా ఉన్న జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ (జీఈఏసీ) పరిధిలోకి వస్తాయి. అయితే, వాణిజ్యపరమైన దృష్టితో మొక్కల్లో ‘జన్యు సవరణ’ చేసే రెండు రకాల ప్రక్రియలను ఈ నిబంధనల పరిధి నుంచి పూర్తిగా మినహాయిస్తూ ఈ ఏడాది మార్చి 30న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ నుంచి ‘ఆఫీస్ మెమో’ జారీ అయ్యింది. ఈ మెమో జన్యు సాంకేతి కతలను మూడుగా వర్గీకరిం చింది. ఒక జాతి మొక్కలోకి వేరే జాతి జన్యువును చొప్పిం చటమే ‘జన్యు మార్పిడి’. పంట మొక్కల్లో ఉన్న కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయటం /తొలగించటం లేదా కొన్ని జన్యువుల ప్రొటీన్ వ్యక్తీ కరణ తీరులో మార్పులు చేయ టమే ‘జన్యు సవరణ’. ఈ రెండు జన్యు సవరణ ప్రక్రియ లలో ఇతర జాతుల నుంచి జన్యు మార్పిడి జరగటం లేదు కాబట్టి... జీఈఏసీ పర్యవేక్షించే కఠిన జీవ భద్రతా నియమా వళి పరిధి నుంచి జన్యు సవరణ పంటలను పూర్తిగా మినహా యిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే, జీనోమ్ ఎడిటెడ్ మొక్కలపై పరిశోధన, అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశోధనా సంస్థలు ఇక మీదట జీఈఏసీ నుంచి ఏ అనుమతులూ తీసుకునే పనిలేదు. జన్యు సాంకేతికతలను నియంత్రించే విషయంలో రాజీ ధోరణితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉప సంహరించుకోవాలని ఆహార, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు డిమాండ్ చేశారు. ఆహార జీవ భద్రతనూ, పర్యావర ణాన్నీ, మన ఎంపిక స్వేచ్ఛనూ పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా కోకన్వీనర్లు కపిల్ షా, శ్రీధర్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు. ‘భారత రాజ్యాంగం అప్పగించిన నియంత్రణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించటం తగదు; జన్యు మార్పిడి మాదిరిగానే జన్యు సవరణలను కూడా అత్యంత జాగరూకత, ముందస్తు జాగ్రత్తలతో పూర్తిగా నియంత్రించవలసిన అవ సరం ఉందని ప్రభుత్వం గుర్తించా’లన్నారు. ‘జన్యు మార్పిడి, జన్యు సవరణ ప్రక్రియలను విభజించి చూడటం అశాస్త్రీయం మాత్రమే కాదు, అత్యంత ప్రమాద భరితం కూడా! జీఈఏసీ పరిధి నుంచి జన్యు సవరణ ప్రక్రియలను మినహాయించటం తగ’దని అలయన్స్ ఫర్ సస్టయినబుల్ అగ్రికల్చర్ కన్వీనర్ కవితా కురుగంటి వ్యాఖ్యా నించారు. జన్యు సవరణ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇతర జాతుల డీఎన్ఏ మార్పిడి చోటు చేసుకోదని చెప్పలేమని స్వతంత్ర విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి కేంద్రా నికి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆరేళ్ల క్రితం దక్షిణ కొరియాలో ఓ శాస్త్రవేత్త రంగు పుట్టగొడుగులకు జన్యు సవరణ చేసినప్పుడు స్వల్ప మాత్రంగా అన్య డీఎన్ఏ మార్పిడి కూడా అసంకల్పంగా జరిగినట్లు తర్వాత తేలిందన్నారు. అందువల్ల, ప్రభుత్వం జన్యు సవరణ ప్రక్రియలను కూడా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోనే ఉంచాలని కోరారు. జన్యు మార్పిడితో పాటు జన్యు సవరణ ప్రక్రియలను సైతం జీవ భద్రతా నియంత్రణ వ్యవస్థల పరిధిలోనే ఉంచటం ద్వారా జన్యు కాలుష్యానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించ జాలదు. ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే వెనక్కి తీసుకోలేని దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అందరూ గ్రహించాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) -
ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!
యుద్ధం, కోవిడ్... విధ్వంసంతో పాటు సరికొత్త అవకాశాలనూ వెంట తెచ్చాయి. కోవిడ్ మహమ్మారి రోగ నిరోధక శక్తినిచ్చే ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తుల ఆవశ్యకతను జనబాహుళ్యం గుర్తెరిగేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం వల్ల భరించలేనంతగా పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరలు సేంద్రియ ప్రత్యామ్నాయాలకున్న ప్రాధాన్యాన్ని పెంచాయి. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తిపై మరింతగా దృష్టిని కేంద్రీకరించేలా పాలకులనూ, రైతులనూ పురికొల్పుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా పక్కన పెడితే పంట దిగుబడులు కుదేలై ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే భయాందోళనలకు ఇప్పుడు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ అనుభవాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు గ్రామస్థాయిలో మద్దతు వ్యవస్థలను నెలకొల్పటం ద్వారా నిర్మాణాత్మక కృషి చేస్తే... ప్రతి రైతునూ ప్రకృతి వ్యవసాయం వైపు దశలవారీగా మళ్లించటం... ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తికరమైన దిగుబడులు సాధించడం సుసాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ అనుభవాలపై థర్డ్ పార్టీ అధ్యయనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సుసంపన్నమైన ఈ అనుభవాలు మనకే కాదు ప్రపంచ దేశాలకూ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలే చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఆర్నెల్లకూ రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రసాయనిక ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న రాయితీని కూడా తగ్గిస్తోంది. అంతిమంగా రైతుకు ఎరువులు మోయలేని భారంగా మారి పోతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇప్పటికే తడిసి మోపెడైంది. 2020–21లో రూ. 1,27,921 కోట్లుండగా, 2021–22 నాటికి రూ. 1,40,122 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం ఇది ఇంకా పెరుగుతుంది. రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరగడమే కాదు, లభ్యత కూడా తగ్గిపోతున్నందున... అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు, రసాయనికేతర సుస్థిర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లటమే శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ వల్లనే ఇది సాధ్యమవుతోంది. ప్రకృతి సేద్యం విస్తారంగా సాగులో ఉన్న కర్నూలు జిల్లాలో 2020–21తో పోలిస్తే 1,25,427 టన్నుల ఎరువుల వాడకం తగ్గింది. ఏపీలో 2020–21లో 42.26 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల వినియోగం జరిగింది. 2021–22 నాటికి ఇది 36.22 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) రసాయనాల విచ్చలవిడి వాడకం సహా అస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతున్నది. ఇప్పటికే 35% సాగు భూమి నిస్సారమై ఎడారిగా మారిపోయింది. 2045 నాటికి 13.5 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ వల్ల సొంత భూములను వదిలి పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. (చదవండి: ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం) వ్యవసాయం... ప్రకృతి వనరులపైన ఆధార పడిన జీవనోపాధి. అది ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రకృతి వనరులు, పర్యావరణం తిరిగి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశంలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. కాబట్టి, పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకునే దిశగా వ్యవసాయం మారాల్సిన అవసరం వుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని దశల వారీగా విస్తరింపజేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెరిగే జనాభాకు సైతం ఆహార భద్రతన్విగలుగుతాం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
సిరిధాన్యాలతో మెట్ట రైతుకు మేలు.. ఏపీ ప్రభుత్వ చర్యలు సంతోషదాయకం!
రబీలో బోర్ల కింద రైతులు వరికి బదులు చిరుధాన్యాల సాగును చేపట్టేలా తగిన ధర కల్పించడం, మిల్లెట్ బోర్డును సత్వరం ఏర్పాటు చేయడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాలను మీరెలా చూస్తున్నారు? నాలుగు వర్షాలొస్తే మెట్ట భూముల్లో పండే సిరిధాన్యాల (అవి చిరుధాన్యాలు కావు.. సిరిధాన్యాల)ను ప్రోత్సహిస్తూ జగన్ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం. నీటి పారుదల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులపై ప్రభుత్వాలు దృషికేంద్రీకరిస్తూ వస్తున్నాయి. పేదరికంలో మగ్గుతున్న వర్షాధార వ్యవసాయదారుల అభ్యున్నతిపై, నిర్లక్ష్యానికి గురైన సిరిధాన్యాల సాగు, వినియోగంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నదని వినటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రయత్నాల వల్ల అల్పాదాయ మెట్ట ప్రాంత రైతాంగం ఆదాయం పెరుగుతుంది. సిరిధాన్యాలను సాగు చేస్తే మనుషులకు అవసరమైన పౌష్టికాహారం అందటంతోపాటు భూమికి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఆహారం 95% భూమి ద్వారానే అందుతోంది. భూసారం అడుగంటిన నేపథ్యంలో ‘నేలల ఆరోగ్యమే మన ఆరోగ్యం’ అన్న భావనను మీరు ఎలా చూస్తున్నారు? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల మూలంగా భూసారం క్షీణించింది. నిస్సారమైన భూముల్లో సైతం సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించుకోవచ్చు. ఈ పంటలు మనుషుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా మార్చడంతోపాటు భూసారాన్నీ పెంపొందిస్తాయి. సిరిధాన్యాల ద్వారా ఒనగూరే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాల గురించి తెలుగు నాట మీరు సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కదా.. ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రజలు, రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిరిధాన్యాల సాగు విస్తీర్ణంతో పాటు వినియోగం పెరుగుతోంది. నేను చెప్పిన పద్ధతుల్లో కషాయాలను వాడటం, సిరిధాన్యాలను, ఇతర సంప్రదాయ ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్న దీర్ఘరోగుల ఆరోగ్యం క్రమంగా స్థిమితపడుతోంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ మార్పు మరింత వేగవంతం కావాలంటే సంప్రదాయ పంటలను, వికేంద్రీకరణ విధానాలను పాలకులు ప్రోత్సహించాలి. జన్యుమార్పిడి పంటలు, జన్యుమార్పిడి ఆహారోత్పత్తుల దిగుమతులకు గేట్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఎప్పటి నుంచో జన్యుమార్పిడి ఆహారాన్ని వినియోగిస్తున్న అమెరికాలో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేసిన మీరు ఈ పరిణామాలపై ఏమనుకుంటున్నారు? పారిశ్రామిక వ్యవసాయ సాంకేతికతల ద్వారా ఉత్పత్తయ్యే ఆహారోత్పత్తుల ద్వారా మన ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా నష్టం కలుగుతుంది. సహజ పద్ధతుల్లో పండించుకోవడంతో పాటు వికేంద్రీకరణ పద్ధతుల్లో ప్రజలే శుద్ధి చేసుకొని స్థానికంగా అందుబాటులోకి తెచ్చుకునే అద్భుతమైన మన దేశీయ సంప్రదాయ ఆహారోత్పత్తుల ద్వారా మాత్రమే ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పడానికి ప్రబల నిదర్శనాలు ఉన్నాయి. షుగర్, బీపీ వంటి జీవనశైలి జబ్బులు పెచ్చుమీరుతున్నప్పటికీ తాము తింటున్న ఆహారానికి– జబ్బులు రావడానికి మధ్య నేరుగా సంబంధం ఉందని ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారా? సిరిధాన్యాలను పండించడం, ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాల అవసరం లేకుండా స్వయంగా మిక్సీల ద్వారా శుద్ధి చేసుకొని వినియోగించడం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అక్కడక్కడా ప్రారంభించారు. సిరిధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు వీటిని ఎలా వండుకొని తినాలో ప్రజలకు రుచి చూపాలి. అన్ని జిల్లాల్లో సిరిధాన్యాల ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. వినియోగం పెరిగితే రైతులు పండించే సిరిధాన్యాలకు మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. ఎద్దు గానుగ నూనెలు, తాటి/ ఈత / జీలుగ బెల్లం ఆవశ్యకతను మీరు నొక్కి చెబుతున్నారు. ప్రజలందరికీ వీటిని అందుబాటులోకి తేవటం సాధ్యమేనా? ఎద్దు గానుగ నూనెల వాడకం పెరగటంతో ఎద్దు గానుగలు చాలా చోట్ల ఏర్పాటవుతున్నాయి. ప్రతి గ్రామంలో నూనె గింజలు సాగు చేసుకొని, అక్కడే నూనెలు ఉత్పత్తి చేసి వాడుకోవాలి. తాటి/ ఈత / జీలుగ చెట్లు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వీటి నీరాతో గ్రామాల్లోనే ఎక్కడికక్కడ బెల్లం ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సమీప భవిష్యత్తులోనే ప్రజలందరికీ అందించవచ్చు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నాం కదా. మీ అభిప్రాయం..? అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుపుకునే దిశగా సన్నాహకంగా ఒకటీ అరా సమావేశాలు మాత్రమే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!
తెలుగు రాష్ట్రాల్లో పంట భూముల గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్ వి. రామమూర్తి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఏర్పాటైన ‘జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్.బి.ఎస్.ఎస్–ఎల్.యు.పి.)’ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆయన సేవలందిస్తున్నారు. స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలను సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇవ్వటంలో ఆయన నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన. ఇటీవల హైదరాబాద్‌లో డా. రామమూర్తితో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూసారం స్థితిగతులను గత కొన్ని దశాబ్దాలుగా మీరు అధ్యయనం చేస్తున్నారు కదా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భూసారం స్థాయిని తెలిపే సూచిక సేంద్రియ కర్బన శాతమే. మట్టి పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. అధికం (0.7%–అంతకన్నా ఎక్కువ), మధ్యస్థం (0.4–06%), అత్యల్పం (0.3– అంతకన్నా తక్కువ) స్థాయిల్లో సేంద్రియ కర్బనాన్ని లెక్కగడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంట భూముల స్థితిగతులపై 30 ఏళ్ల క్రితం పరీక్షలు చేసినప్పుడు సేంద్రియ కర్బనం సగటున మధ్యస్థంగా (అంటే.. 0.5%కు మించి) ఉండేది. నాలుగేళ్ల క్రితం పరీక్షించినప్పుడు 0.2–0.3%కి తగ్గిపోయింది. పంటలు బాగా పండాలంటే కనీసం 1% అయినా సేంద్రియ కర్బనం ఉండాలి. మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి 1% కష్టం అనుకున్నా.. 0.7 నుంచి 0.9 వరకైనా పెంచుకోగలగాలి. సేంద్రియ కర్బనమే నేలకు, పంటకు ప్రాణం. పౌష్టికాహార భద్రతకు ఇది చాలా ముఖ్యం. సేంద్రియ కర్బనం అంతగా ఎలా తగ్గింది? రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వాడుతున్నారు. పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. ఒకే పంట వేస్తున్నారు. ప్రతి ఏటా అదే సాగు చేస్తున్నారు. ఏయే పంటల్లో ఎక్కువ వాడుతున్నారు? వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీలు కూడా అంతే. అందుకే సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. రసాయనిక కలుపు మందులూ కారణమేనా? ఖచ్చితంగా. రసాయనిక ఎరువులతో భూమిలో వానపాములు నశించాయి. పురుగుమందులు, కలుపు మందులతో భూమిలో సూక్ష్మజీవరాశి వంద శాతం నశిస్తోంది. రైజోబియం బాక్టీరిఆయ, ఆక్టినోమైసిట్స్, మైకోరైజా వంటి మేలు చేసే సూక్ష్మజీవరాశి పూర్తిగా అంతరించిపోతోంది. పరిష్కారం ఏమిటి? పంటల సాగు పదికాలాల పాటు బాగుండాలంటే మనం చేసే పనుల వల్ల భూసారానికి ఏమవుతుందో కూడా గమనించుకోవాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవటం అత్యవసరం. పంట బాగా పండాలంటే 16 స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండాలి. మట్టిలో సేంద్రియ కర్బనం ఎంత ఎక్కువ ఉంటే పంటలకు వీటి లభ్యత అంత ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం 0.2% ఉన్న భూముల్లో పోషకాలు మరీ అడుగంటిపోయాయి. సాగు పద్ధతిలో మార్పులు చేసుకొని సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. అంతర పంటలతో సమస్య తీరుతుందా? పత్తి వంటి ప్రధాన పంట మధ్యలో 3 సాళ్లకు ఒక సాలు పప్పుధాన్యాలు వేసుకుంటే మంచిది. అంతర పంటల వల్ల ఆర్థికంగా రైతుకు రిస్క్ తగ్గుతుంది. ఒక పంట పోయినా మరో పంట ఆదుకుంటుంది. సేంద్రియ కర్బనం పెంచుకోవడానికైతే అంతర పంటలతో 30–40% ప్రయోజనం ఉంటే పంట మార్పిడి వల్ల వంద శాతం ఉంటుంది. వరుసగా 3,4 ఏళ్లు పంట మార్పిడి చేస్తూ రసాయనిక ఎరువులతోపాటు పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు వేసుకుంటూ ఉంటే సేంద్రియ కర్బనంలో మార్పు కనిపిస్తుంది. పంట భూములు పూర్తిగా నిస్సారమైపోకుండా ఉండాలంటే పట్టుబట్టి సేంద్రియ కర్బనాన్ని 0.7%కి పెంచుకోవటం ముఖ్యం. సేంద్రియ సేద్యం వైపు మళ్లాల్సిందేనా? రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్తే సడన్‌గా దిగుబడులు తగ్గుతాయి. రసాయనిక, సేంద్రియ ఎరువులు సమతూకంగా వాడుతూ సమీకృత సేద్యం చేపట్టాలి. క్రమంగా కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోకి మారాలి. క్రమంగా సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి దిగుబడులు తగ్గకుండానే సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏయే జిల్లాల్లో భూములు ఏయే పంటలకు అనుకూలమో మీ సంస్థ చెప్తోంది కదా..? అవును. దేశవ్యాప్తంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ ప్రకటించాం. ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆ ప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి.. శాస్త్రీయంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పాం. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు పొటెన్షియల్ క్రాప్ జోన్స్‌పై మండల స్థాయి వివరాలను విశ్లేషించి 71 పంటలను పరిశీలించాం. ఏయే జిల్లాల్లో సాగుకు ఏయే పంటలు అనుకూలమో సూచించాం. ప్రతి జిల్లాకు 3 నుంచి 20 అనుకూల పంటలు సూచించాం. ఈ పనికి రెండేళ్లు పట్టింది. ఈ సమాచారాన్ని మార్కెట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో జోడించి విశ్లేషించుకొని మేం సూచించిన అనుకూల పంటల జాబితాలో నుంచి ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వం, రైతులు నిర్ణయించుకోవాలి. ఈ అవగాహన రసాయనిక సేద్యంతోపాటు ప్రకృతి సేద్యం చేసే రైతులకూ ఉపయోగమేనా? సాగు పద్ధతిని బట్టి, నమూనాలు సేకరించే ఎండ, వానా కాలాలను బట్టి మారిపోయే అంశాల ఆధారంగా మేం ఈ అంచనాలకు రావటం లేదు. ఏ రైతుకైనా పొటెన్షియల్ క్రాప్ జోన్ల సమాచారం ఉపయోగకరమే. (డా. రామమూర్తి ఈ–మెయిల్: (ramamurthy20464@gmail.com ) – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్!
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పలు సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్‌ను ఏదో ఒక ‘వంగడం’లోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసలకోర్చి ‘జన్యుమార్పిడి’ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా, జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే.. మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని (ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు. వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ ‘డి’ని రాబట్టానని ఆయన ప్రకటించారు. తన పొలంలో నుంచే పై మట్టిని, (4–6 అడుగుల) లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి.. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకటరెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలు, టీవీ ఛానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులక్కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంట ను ఆశించకుండా చేయడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు. ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఆవిష్కరణల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తున్న చింతల వెంకటరెడ్డి వ్యవసాయోత్పత్తుల్లో విటమిన్ ఎ., సి.లతో పాటు ‘డి’ రాబట్టుకునే సాగు పద్ధతులపై అనేక ఏళ్ల పాటు విస్తృత ప్రయోగాలు చేసి నిర్థారణకు వచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలను క్రమపద్ధతిలో రాసి పేటెంట్ కోసం ధరఖాస్తు పంపారు. పేటెంట్ పొందటానికి దీర్ఘకాలం పడుతుంది. మొదట మన దేశంలో పేటెంట్ కోసం 2019 ఆగస్టు 02న ధరఖాస్తు పంపారు (దీనిపై ఇంకా పేటెంట్ మంజూరు కాలేదు). ఆ తర్వాత, 2020 ఆగస్టు 1న ‘అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ.– వైపో)కు ధరఖాస్తు పంపారు. ఈ ధరఖాస్తుపై స్పందించిన వైపో ఈ నెల 11న చింతల వెంకటరెడ్డి ‘మొక్కల్లో పోషక విలువలను పెంపొందించే మిశ్రమం’ గురించి తన వెబ్సైట్లో పబ్లికేషన్ విడుదల చేసింది (ఇంటర్నేషనల్ పబ్లికేషన్ నంబర్: డబ్ల్యూ.ఓ. 2021/024143 ఎ1). ‘వైపో’ ఇచ్చిన పబ్లికేషన్ పేటెంట్ కాదు. అయితే, చింతల వెంకటరెడ్డి మాదిరిగా రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి చేయకుండా ఒక సేంద్రియ మిశ్రమం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో డి విటమిన్ తదితర విటమిన్లను పొందటానికి ఉపయోగడపడే మిశ్రమం గురించి గతంలో ఏ దేశంలోనూ ఎవరికీ మేధో హక్కులు ఇవ్వలేదని వైపో పేర్కొంది. 130 దేశాల్లోని జాతీయ స్థాయి పేటెంట్ కార్యాలయాలకు ధరఖాస్తు చేసుకొని పేటెంట్ హక్కులు పొందవచ్చిన వైపో పబ్లికేషన్ మార్గాన్ని సుగమం చేసింది. కాల్షియంను దేహం గ్రహించాలన్నా, ఎముక పుష్టి కలగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా డి విటమిన్ ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలకు రోజుకు 1,000 ఇంటర్నేషనల్ యూనిట్(ఐ.యు.)లు, పిల్లలకు 400 ఐ.యు.లు అవసరం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారికి ఇంకా ఎక్కువ మోతాదులో డి విటమిన్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. ఎండలో తిరగని వారు పుట్టగొడుగులు (ఎండబెట్టినవి) తిని విటమిన్ డి కొరతను తగ్గించుకోవచ్చు. అయితే, అదేదో రోజువారీగా తినే ఆహార ధాన్యాల్లోనే వుంటే మరింత మేలు కదా! ఏ పంట అయినా సరే.. ఏ పంట దిగుబడులోనైనా డి., ఎ., సి. విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైంది. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చు. జన్యుమార్పిడి అవసరం లేదు. ప్రత్యేక రసాయనాలు వాడనకవసరం లేదు. ప్రకృతిలో అందరికీ ఎక్కడపడితే అక్కడ దొరికే ఆహారోత్పత్తులనే వాడి కావల్సిన విటమిన్లను పంట దిగుబడుల్లో వచ్చేలా చేయవచ్చు. ఈ ఆవిష్కరణకు ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వెలువడటం సంతోషదాయకం. భారత పేటెంట్ కోసం వేచి చూస్తున్నాను. క్యారట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలను వాడి రైతులు ఎవరైనా తమ పంట ఉత్పత్తుల్లో విటమిన్ డి రాబట్టుకోవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించి, తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ టెక్నిక్‌తో పండించిన ఆహారోత్పత్తులను దేశవిదేశాల్లో వాణిజ్య పరంగా విక్రయించాలనుకునే వ్యక్తులు/సంస్థలు మాత్రం ముందుగా నాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. – పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్ మిశ్రమ ద్రావణం ఎంత మోతాదులో వెయ్యాలి? ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారట్లు, చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి, ఒక లీటరు నీరు కలిపి మిక్సీలో వేసి.. ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4–5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే, పూత, పిందె దశలో 4–5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు అని వెంకటరెడ్డి తెలిపారు. ఎ, సి విటమిన్ల కోసం ఏం చేయాలి? ‘ఎ’ విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలకడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. ‘సి’ విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మ కాయలను 2 కిలోలు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకటరెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 అడుగుల ఎత్తున ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన ‘రెయిన్ డ్రిప్’ ప్లాస్టిక్ ట్యూబ్‌లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్‌తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు. క్యారెట్, చిలగడ దుంప,మొక్కజొన్న పిండితో మిశ్రమం.. ‘డి’ విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నిక్‌ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, దుంప పంటలు, ఆకుకూరలు, క్యాబే జీ వంటి పూల జాతి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నల మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ‘రెయిన్ డ్రిప్’ ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్పప్పుడు నెల రోజుల్లో 4–5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితోపాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరొటినాయిడ్స్‌ను పంట మొక్కలు గ్రహించడం ద్వారా విటమిన్ ‘డి’ ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు. వరి, గోధుమల్లో విటమిన్ డి తెప్పించడం కోసం 2011 నుంచి ప్రయోగాలు చేస్తున్నానని, 2018లో సక్సెస్ అయ్యానని, తదుపరి కూడా అనేక పంటలు పండించి నిర్థారణకు వచ్చానని చింతల వెంకటరెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వల్లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను డి విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5–6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు. డి విటమిన్ బియ్యం, గోధుమలను చూపుతున్న వెంకటరెడ్డి ఏ పంటలో ‘డి’ విటమిన్ ఎంత? క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడదుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకటరెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో(దిగుబడి హెక్టారుకు 4.68 టన్నులు) 100 గ్రాములకు 1,606 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.లు) డి విటమిన్ ఉండగా, 2020 ఖరీఫ్‌లో పండించిన పంటలో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు డి విటమిన్ ఉన్నట్లు విమ్తా లాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేలిందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 రబీలో పండించిన వరి బియ్యంలో 100 గ్రాములకు 136 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీఫ్‌లో పండించిన వరి బియ్యం (దిగుబడి హెక్టారుకు 9.68 టన్నులు)లో 100 గ్రాములకు 102.70 ఐ.యు.ల మేరకు విటమిన్ డి వచ్చిందని ఆయన వివరించారు. -
‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’డెస్క్ ఇన్చార్జ్, సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్ఎస్) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్.ఎస్ ఈ పురస్కారాలను అందిస్తోంది. పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్ చేను–చెలక ఎడిటర్ విద్యాసాగర్, సైంటిస్ట్ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్ఎస్ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్‌లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
కరువు కాలపు క్రాంతిదర్శి!
* థాయ్‌లాండ్ పంట ‘ఆపిల్ బేర్’ సాగుతో అధికాదాయం * మూడున్నర ఎకరాల తోట.. రోజుకు 3 టన్నుల దిగుబడి * అరగంట డ్రిప్ నీటితోనే అద్భుత ఫలితాలు.. కరువు కసిగా కోరలు చాస్తున్నప్పుడు.. కర్షకుడే తన సేద్య వ్యూహాన్ని సరికొత్తగా తిరగ రాసుకోవాలి. సేద్యానికి కొత్త ఊపిరిపోసే పంటల కోసమో.. పండ్ల తోటల కోసమో ప్రపంచమంతా వెతకాలి. అంతేకాదు.. ప్రతి నీటి బొట్టునూ అపూర్వ సామర్థ్యంతో వినియోగించుకుంటూనే.. స్థిరంగా నికరాదాయాన్నిచ్చే సరికొత్త వంగడాలను ఆవిష్కరించుకోవాలి. ఈ చారిత్రక అవసరాన్ని సకాలంలో గుర్తించిన వారే క్రాంతిదర్శి. ఆ కోవకు చెందిన సృజనాత్మక కృషీవలుడే గుంటక కృష్ణారెడ్డి. థాయ్‌లాండ్‌కు చెందిన ‘ఆపిల్ బేర్’తోపాటు అనేకానేక సరికొత్త ఉద్యాన పంటలపై ఆయన దృష్టి సారించారు. మార్కెట్లో అమ్ముడుపోయే కొత్త పంటలను, బెట్టను తట్టుకునే ఉద్యాన పంటలను ఎంచుకోవడం కృష్ణారెడ్డిని కరువు కాలపు విజేతగా నిలబెట్టాయి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ బేర్‌ను ‘తెలంగాణ ఆపిల్’గా గుర్తించి ప్రోత్సహిస్తోంది! మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు సమీపంలోని చెర్లపల్లికి చెందిన రైతు గుంటక నాగిరెడ్డి కుమారుల్లో చిన్నవాడు కృష్ణారెడ్డి. డిగ్రీ వరకు చదువుకొని సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికైన కొద్ది రోజులకే ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. ఆది నుంచీ ఉద్యాన పంటలపై ఆసక్తి కలిగిన ఆయన న్యూజిలాండ్‌లో ఉద్యాన తోటల కంపెనీలో పని చేశారు. తదనంతరం కొంతకాలం పాటు ఆస్ట్రేలియా వెళ్లి.. అనేక ఉద్యాన తోటల సాగులో అనుభవం గడించిన తర్వాత 2004 అక్టోబర్‌లో స్వస్థలానికి తిరిగొచ్చారు. తండ్రి పంచి ఇచ్చిన 18 ఎకరాల పొలంలో సేద్యం ప్రారంభించారు. బోర్లు తప్ప మరో నీటి వనరు లేదు. బోరులో ఇంచ్ నీరు మాత్రమే పడ్డాయి. ఇంత తక్కువ నీటితో ఏం పంటలు పండిస్తాం? ఏం ఆదాయం వస్తుంది? ఈ పరిస్థితుల్లో వ్యవసాయం కొనసాగించాలంటే తక్కువ నీటితో అధికాదాయాన్నిచ్చే పంటలపై దృష్టి సారించడం ఒక్కటే మార్గమని తలచిన కృష్ణారెడ్డి దేశాటన ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్నిచోట్ల 2 వేల అడుగుల లోతు నుంచి ఇంచ్ నీటిని తోడి లేదా ట్యాంకర్లతో నీరు తెచ్చి దానిమ్మ తోటలు పెంచి, దేశంలోకెల్లా నాణ్యంగా, అధిక దిగుబడి తీయడం ఆయనను ఆకర్షించింది. అంతే.. పదెకరాల్లో 5 వేల దానిమ్మ మొక్కలు నాటారు. ఢిల్లీ ఐఐటీ నిపుణుల సలహా మేరకు 25 లక్షల లీటర్ల వాటర్ పాండ్ నిర్మించడం ద్వారా నీటి ఇబ్బందులను అధిగమించారు. దానిమ్మ ఎడారి పంట. దీనికి కొద్ది నీరైనా చాలునంటారాయన. ఆ ధైర్యంతోనే 2005 నాటికి 18 ఎకరాల్లోనూ దానిమ్మ తోట వేశారు. నాలుగైదేళ్లు గడిచేటప్పటికి దానిమ్మ చెట్టుకు 50-60 కిలోల వార్షిక దిగుబడి సాధించారు. పన్నెండేళ్ల పాటు అధిక ఫలసాయాన్నిచ్చిన దానిమ్మతోట 2014 నుంచి మెత్తబడింది. కాండానికి పగుళ్లు రావడం వంటి సమస్యలు రావడంతో కృష్ణారెడ్డి క్రమంగా దానిమ్మ తోటను తీసేస్తూ.. ఇతర పంటల వైపు దృష్టి సారించారు. దానిమ్మ సాగులో ఆయనకున్న పట్టు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వందలాది మంది రైతుమిత్రులను సంపాదించి పెట్టింది. రోజూ ఉదయం 2 గంటలు వాట్సప్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తుంటారు. నూరేళ్ల పంట ‘ఆపిల్ బెర్’! వాతావరణ సారూప్యతల వల్ల థాయ్‌లాండ్‌లోని ఉద్యాన పంటలు మనకు నప్పుతాయని కృష్ణారెడ్డి గ్రహించారు. రెండేళ్ల క్రితం ఆ దేశానికి వెళ్లి ఉద్యాన తోటలు పరిశీలించి.. తెలంగాణ, రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లోనూ కనీస దిగుబడినిచ్చే మేలైన పంటలేమి ఉన్నాయో శోధించి.. తొలుత ఆపిల్ బెర్ను ఎంపిక చేశారు. 80 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి దానిమ్మ చెట్ల మధ్యలో నాటారు. దానిమ్మ తోట నరికేసేటప్పటికి ‘ఆపిల్ బెర్’ చేతికి అందివచ్చింది. ఇప్పుడు మూడున్నర ఎకరాల్లో కృష్ణారెడ్డి ఆపిల్ బెర్ సాగు చేస్తున్నారు. సాళ్ల మధ్య 13 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరంలో నాటారు. డ్రిప్ ద్వారా తగుమాత్రంగా నీటిని, ద్రవరూప ఎరువులను అందిస్తున్నారు. 1,300 మొక్కలు నాటగా.. ఆడవి పందుల దెబ్బకు 300 మొక్కలు పాడయ్యాయి. ఇది మూడో ఏడాది. రోజుకు 3 టన్నుల ఆపిల్ బెర్ దిగుబడి వస్తోంది. దీనికి చీడపీడల బెడద చాలా తక్కువ. మందులను రెండుసార్లు పిచికారీ చేస్తే చాలు. వందేళ్ల వరకు ఈ తోట దిగుబడినిస్తుందని కృష్ణారెడ్డి తెలిపారు. నాటిన 6 నెలలకు పూత పూస్తుంది. మరో మూడున్నర నెలలకు కాయలు కోతకు వస్తాయి. కాయ 90-130 గ్రాముల వరకు పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు ఆపిల్ బెర్ రకాలున్నాయి. కిలో ఆపిల్ బెర్ ధర రూ. 25 గ్రీన్ ఆపిల్‌ను థాయ్ లోకల్ రేగుతో గ్రాఫ్టింగ్ చేయడంతో ఆపిల్ బేర్ రుచిలో, పోషక విలువలలో ఆపిల్‌కు తీసిపోదు. గుండె, కిడ్నీ, లివర్ ఆరోగ్య పరిరిక్షణకు ఉపకరిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినదగినది. ఎన్ని కాయలు తిన్నా మొహం మొత్తనిది కావడంతో ఆపిల్ బెర్కు మంచి మార్కెట్ ఉందని కృష్ణారెడ్డి అన్నారు. కిలో రూ. 25 చొప్పున.. పది కిలోల అట్టపెట్టెల్లో పెట్టి విక్రయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, విజయవాడ మార్కెట్లకు పంపుతున్నారు. మెట్ట పొలాల్లో ఆపిల్ బేర్‌ను సాగు చేయడానికి ఎకరానికి రూ. 30 వేల వరకు మూల పెట్టుబడి అవుతుందని.. ఎంత కాదన్నా కిలో ధర రూ. 3 నుంచి 10 వరకు ఉంటుందని.. కనీసం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు నికరాదాయం వస్తుందని కృష్ణారెడ్డి చెబుతున్నారు. పోషణ, నీటి యాజమాన్యం బాగుంటే ఆపిల్ బేర్ దిగుబడి చెట్టుకు తొలి ఏడాది 10-15 కిలోలు, రెండో ఏడాది 100 కిలోలు, 3వ ఏడాది 100-150 కిలోల వరకు వస్తుంది. డ్రిప్ ద్వారా కూడా నీరివ్వలేని కరువు పరిస్థితులొచ్చినా చెట్టుకు ఏడాదికి కనీసం 50 కిలోల దిగుబడైనా వస్తుందని ఆయన అన్నారు. రైతు తోటను కౌలుకిచ్చుకున్నా మంచి ఆదాయం వస్తుందన్నారు. అందువల్లనే ఈ పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఆపిల్’గా ప్రకటించి ప్రోత్సహిస్తోందన్నారు. తోట ఒకటే.. సీజన్లు రెండు.. ఆపిల్ బెర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఏడాదిలో రెండు సీజన్లలో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చని కృష్ణారెడ్డి వివరించారు. తోటలో ఉన్న సగం చెట్ల నుంచి జూన్ - ఆగస్టు నెలల్లో, మిగతా సగం చెట్ల నుంచి జనవరి - మార్చి నెలల్లో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చన్నారు. మామిడి వంటి తోటల్లో ఇలాంటి సదుపాయం ఉండదని, దేశవ్యాప్తంగా ఒకే సీజన్లో దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ఆపిల్ బెర్ పంట పూర్తయిన తర్వాత చెట్టు మొదలును 1-2 అడుగుల ఎత్తున పూర్తిగా నరికేయాలి. తర్వాత పెరిగే పిలకల్లో 4 కొమ్మలను నిలువుగా పెరగనివ్వాలి. ఆ కొమ్మలకే పూలు, కాయలు వస్తాయి. మొదలు నరికేసిన 9 నెలల్లో కాయలు కోతకు వస్తాయి. డ్రిప్ నీరు ఒకే చోట ఇవ్వాలి.. కృష్ణారెడ్డి సాగు పద్ధతి సునిశిత పరిశీలనతో కూడి ఉంటుంది. దానిమ్మ.. మిరప.. పసుపు.. ఆపిల్ బేర్.. పంట ఏదైనా రైతు విజయం సాధించాలంటే నీటి యాజమాన్యమే కీలకమని ఆయన అంటారు. పంట పాడైనా, బాగున్నా అందుకు కారణం నీటి యాజమాన్యమే. ముఖ్యంగా డ్రిప్ ద్వారా తోటలకు నీరందించేటప్పుడు.. మొదట్లో ఎక్కడైతే డ్రిప్పర్ నీటిని వదులుతుందో.. చెట్టు తన పీచు వేళ్ల(సక్కర్ జోన్)ను ఆ ప్రాంతంలో విస్తరింపజేస్తుంది. అదే చోట, నిర్ణీత సమయానికి నీటి కోసం వేళ్లు ఎదురుచూస్తుంటాయి. అందువల్ల డ్రిప్ లైను అటూ ఇటూ కదిలిపోకుండా 20 అడుగులకో చోట యాంకిల్ పైపులతో కట్టి ఉంచడం ముఖ్యం. రోజుకు చెట్టుకు 4 లీటర్ల నీటితోనే.. చెట్టు వద్ద భూమిలో పీచు వేళ్లు అల్లుకొని ఉన్న 8 అంగుళాల లోతు మట్టి తడిస్తే చాలు. తల్లి వేరు దిగినంత 10 అడుగుల లోతు వరకు నీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అవగాహనతోనే కృష్ణారెడ్డి ప్రత్యేక డ్రిప్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ఫామ్‌పాండ్‌లో నిల్వచేసుకున్న నీటిని.. రోజూ ఉదయం అరగంట సేపు చెట్టుకు 4 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. కరెంటు ఉండి, నీరు అందుబాటులో ఉంటే .. సాయంత్రం పూట మరో అరగంట నీటిని ఇస్తున్నారు. సాధారణ డ్రిప్‌తో ఖర్చయ్యే నీటిలో సగం నీటితోనే కరువు కాలంలోనూ ఆపిల్ బేర్ తోటను కాపాడుకోగలుగుతున్నారు. కృష్ణారెడ్డి ప్రస్తుతం 60% సేంద్రియ పద్ధతిలో, 40% రసాయనిక పద్ధతిలో తోటకు ద్రవరూపంలో పోషకాలను అందిస్తున్నారు. పండ్లకు సరైన సేంద్రియ మార్కెట్ అభివృద్ధి చెందితే.. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి మంచి దిగుబడులు పొందడానికి ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు. బండి ఎరువుతో 10 బండ్ల ఎరువు తయారీ పశువుల ఎరువును నేరుగా పొలంలో వేయకుండా.. దాన్ని పది రెట్లు పెంపొందించి వాడుకునే పద్ధతిని కృష్ణారెడ్డి అనుసరిస్తున్నారు. నాణ్యమైన బండి పశువుల ఎరువును సేకరించి, దానితో 3 నెలల్లో స్వల్ప ఖర్చుతో పది బండ్ల ఎరువును తయారు చేస్తున్నారు. ఒక పొర పశువుల ఎరువు వేసి, దానిపైన డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా చల్లి, దానిపైన ఒక పొర చెరువు మట్టి, చేను మట్టి.. ఇలా పలు వరుసలుగా వేస్తూ.. 3 నెలల్లో పుష్కలంగా సూక్ష్మజీవరాశి కలిగిన సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు వాడుతున్నారు. ఇలా చేస్తే పంట భూమిలో స్వల్ప కాలంలోనే హ్యూమస్ (జీవనద్రవ్యం) వృద్ధి చెంది భూమి సారవంతమవుతుందని, ఆ పంట కాలంలోనే దిగుబడుల పెంపునకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు వినూత్నంగా, బహుముఖ వ్యూహంతో ముందడుగేసే రైతే నిలబడగలుగుతాడు. రైతులోకానికే వెలుగుబాటను చూపగలుగుతాడు.. అటువంటి ధన్యజీవి గుంటక కృష్ణారెడ్డి. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : పోల్కంపల్లి గాండ్ల నాగరాజు ఇక ‘లోగాన్’ పండ్ల సాగు నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పండే పండ్ల తోటల రకాలపై నిరంతరం అధ్యయనం చేస్తున్న కృష్ణారెడ్డి మరికొన్ని థాయ్‌లాండ్ వంగడాలపై దృష్టి కేంద్రీకరించి రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. లోగాన్ పండ్ల తోటను రెండెకరాల్లో సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. లోగాన్: నాటిన రెండేళ్లకు దిగుబడి వస్తుంది. సపోట, కివీ పండ్ల రుచి కలగలిసి ఉంటుంది. మార్కెట్ ధర కిలో రూ. 200. రైతుకు నికరంగా రూ. 20 వచ్చినా చాలు. ఆల్‌టైమ్ గుచ్ఛా లెమన్ : నిమ్మ సాధారణంగా మూడున్నరేళ్లకు కాపుకొస్తుంది. ఇది ఏడాదిన్నరలోనే కాపుకొస్తుంది. కిలో రూ. 40 వరకు ధర పలుకుతుంది. జామ.. థాయ్ బిగ్ బాస్: అర కిలో వరకు బరువు పెరుగుతుంది. తియ్యగా ఉంటుంది. విత్తనాలు తక్కువ. కిలో పెరిగే రకమూ ఉంది. కానీ జనం కొనరు. థాయ్ మునగ: అధిక దిగుబడినిస్తుంది. కాయలో గుజ్జు బాగా ఉంటుంది. ఏడాదిన్నరలో పూర్తిస్థాయి దిగుబడినిస్తుంది. కిలో రూ. 40 వరకు ఉంటుంది. థాయ్ బ్లాక్ జామున్: 60 గ్రా. బరువు పెరుగుతుంది. 3 ఏళ్లకు దిగుబడినిస్తుంది. 10 అడుగులు పెరిగిన చెట్టు పిలక కత్తిరించి, కొమ్మలను తాళ్లతో లాగి కట్టాలి. హార్టికల్చరే మెట్ట రైతు కల్చర్ కావాలి! పత్తి వంటి సీజనల్ పంటలకన్నా నీటి ఎద్దడిలోనూ కనీస భరోసా ఇవ్వగలిగిన పండ్ల తోటల సాగుతోనే మెట్ట ప్రాంత రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. బెట్టను తట్టుకొని కనీస దిగుబడినిచ్చే థాయ్‌లాండ్‌కు చెందిన పండ్ల తోటల సాగు తెలంగాణ, రాయలసీమ రైతులకు చాలా అనువైనవని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఆపిల్ బేర్‌ను రెండేళ్లు సాగు చేసి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకున్న తర్వాతే రైతులకు సిఫారసు చేస్తున్నాను. త్వరలో రెండెకరాల్లో లోగాన్ పండ్ల తోట నాటబోతున్నాను. నీరు, డబ్బు తక్కువగా ఉన్న రైతులు కూడా ఆత్మహత్యల బారిన పడకుండా భరోసాతో బతకాలి. నేనున్నా లేకున్నా నేను పరిచయం చేసిన పంటలు రైతులకు అండగా ఉండాలి. అదే నా లక్ష్యం. - గుంటక కృష్ణారెడ్డి (96663 28231), చెర్లపల్లి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా -
సాగు ఖర్చు తగ్గేదెలా?
పంట పొలాల్లో మరణ మృదంగం మోగిస్తున్న వ్యవసాయ సంక్షోభాన్ని నిలువరించడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రశ్నపై దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ పరిశోధనల సారాన్ని స్వయంగా సేద్యం చేస్తున్న యువ రైతులకు నేరుగా అందించడానికి వీలుగా శిక్షణ ఇవ్వడం మేలని విశ్వవిద్యాలయం భావించింది. దూరవిద్య ద్వారా తెలుగులో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కేవీకేలలో వారానికో రోజు కాంటాక్టు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకీ యువ రైతులకు ఏయే అంశాలపై శిక్షణ అవసరం? 9 జిల్లాల నుంచి 77 మంది యువ రైతులను ఈ నెల 1న హైదరాబాద్‌లోని విస్తరణ విద్యా సంస్థకు పిలిపించి వారి అభిప్రాయాలను సేకరించారు. అనేక ఇతర అంశాలతోపాటు.. రసాయనిక ఎరువులు, పురుగు, కలుపు మందుల ఖర్చు పెచ్చుమీరిందని.. ఈ ఖర్చులు తగ్గించే సమగ్ర సేంద్రియ/ప్రకృతి సాగు పద్ధతుల్లో శిక్షణనివ్వాలని యువ రైతులు కోరారు. అయితే, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం తప్ప.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై ఇప్పటి వరకు సమగ్ర పరిశోధనా విభాగాన్నే తెరవని మన విశ్వవిద్యాలయం(తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి).. ఇక యువ రైతులకెలా నేర్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ పద్ధతులను ఏళ్ల నాటి నుంచి అవలంబిస్తూ అనేక పంటల్లో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న, పెద్ద రైతులతోపాటు విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు/ అధికారులూ లేకపోలేదు. వీరి తోడ్పాటుతో యువ రైతులకు నిక్షేపంగా శిక్షణ ఇవ్వొచ్చు. అయితే విశ్వవిద్యాలయ నిబంధనలు అందుకు ఒప్పుకుంటాయా? ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు పాటించకుండా ఖర్చు తగ్గేదెలా? రైతుల అభిలాష నెరవేరేదెలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి! ఖర్చు తగ్గే సాగు పద్ధతులు నేర్పాలి! రెండెకరాల్లో పత్తి, ఎకరన్నరలో వరి, ఎకరంలో టమాటా పండిస్తున్నం. వ్యవసాయం ఖర్చు బాగా పెరిగిపోయింది. గిట్టుబాటు కావటం లేదు. శిక్షణ ద్వారా కూలీల ఖర్చు తగ్గించుకునే సాగు పద్ధతులను నేర్చుకోవాలనుకుంటున్న. డీఏపీ బస్తా రూ. 1,200కు పెరిగిపోయింది. కూలి రూ. 200 దాటింది. సేంద్రియ ఎరువులను రైతులు ఎవరికివారు సొంతంగా తయారు చేసుకోవడంపై శిక్షణ ఇవ్వాలి. - మద్ది శ్రావణి(93924 84542), యువ మహిళా రైతు, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా రైతు కొడుకును రైతుగా నిలబెట్టే శిక్షణ కావాలి ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల మోతాదుపై రైతుల్లో అవగాహన లేదు. వీటిని విచక్షణారహితంగా వాడేస్తున్నందున ఖర్చు పెరుగుతోంది. డిగ్రీ చదివిన నా వంటి రైతులు కూడా పక్క వాళ్లను చూసి ఎక్కువగా వాడేయాల్సి వస్తోంది. వీటిపై పూర్తి అవగాహన కలిగించేలా శిక్షణ ఇవ్వాలి. అన్ని పంటల్లో పూర్తిస్థాయిలో సొంత విత్తనం తయారుచేసుకోవడం, మాక్ సొసైటీల ఏర్పాటుపై అవగాహన కలిగించాలి. రైతుల కోసం ప్రత్యేక తెలుగు టీవీ ఛానల్ ప్రారంభించాలి. సెల్ ద్వారా పంట ఫొటోలు పంపితే శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వాలి. రైతు కొడుకును రైతుగా నిలబెట్టే భరోసా ఇచ్చేలా శిక్షణ సమగ్రంగా ఉండాలి. - రాకం దేవేందర్(97015 59376), లింగయ్యగిరి, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా అధికాదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి! తాతలు తండ్రుల నాటి నుంచి సాగు చేస్తున్న వరి, పత్తి వంటి సంప్రదాయక పంటల సాగుపై చిన్న కమతాలున్న యువ రైతులకు బొత్తిగా ఆసక్తి లేదు. ధనిక రైతులకే పరిమితమైన అధికాదాయాన్నిచ్చే పంటలపై వీరికి ఆసక్తి ఉంది. పూలు, పండ్ల తోటల సాగు, చేపల పెంపకం, పాడి పెంపకంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అధికాదాయాన్నిచ్చే పంటలకు పెట్టుబడి ఎక్కువ అవసరమైనప్పటికీ.. అయినావాళ్లు నలుగురూ కలిసి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సబ్సిడీలకన్నా సమాచారం, శిక్షణ ఇవ్వడం అవసరం. చిన్న రైతులకు వ్యవసాయ సూచనలు, సలహాలు అందటం లేదు. - పొడిచేటి సురేందర్, నకిరేకల్(90303 69300), నల్లగొండ జిల్లా సేంద్రియ సాగుపై ఊరూరా ప్రదర్శన క్షేత్రాలు పెట్టాలి 18 ఎకరాల్లో పత్తి, వరి, కంది పండిస్తున్నా. పాలిహౌస్‌లతో పెద్ద రైతులకే ఉపయోగం. చిన్న రైతులందరికీ ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయడంపై ప్రతి గ్రామంలో రెండెకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రియ రైతులతో శిక్షణ ఇప్పించడం అవసరం. అన్ని పంటల విత్తనాలు తయారు చేసుకోవడం.. స్ప్రేయర్లు, చిన్న యంత్రపరికరాలు, మోటార్ల మరమ్మతులు చేయడం.. 50-100 కోళ్లు పెంచుకోవడం, పశువ్యాధులకు చికిత్స చేయడం.. ప్రతి ఊళ్లో కొందరు యువ రైతులకు శిక్షణ ఇప్పించాలి. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా లబ్ధిపొందడంపై శిక్షణ ఇవ్వాలి. ఆవులు, గేదెలను 50% సబ్సిడీ మీద ఇవ్వాలి. - పల్లె రమాదేవి (90003 02289), మహిళా రైతు, ఎత్బార్పల్లె, రంగారెడ్డి జిల్లా యువ రైతులకు గోఆధారిత సాగు నేర్పించాలి అనేక దేశవాళీ వరి వంగడాలు, కూరగాయలను సాగు చేస్తున్నా. 4 ఏళ్ల నుంచి గోఆధారిత వ్యవసాయం చేస్తున్నా. ప్రతి రైతుకూ ఆవులుండాలి. పాడి-పంట ఉంటేనే రైతుకు లాభం. పశువుల ఎరువు కొనుక్కొని వేస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తున్నాను. గోమూత్రం పిచికారీ వల్ల వైరస్ తెగుళ్లు రావడం లేదు. ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి బాగుంది. యువ రైతులకు ఈ పద్ధతులను నేర్పిస్తే.. వ్యవసాయంలో నిలబడగలుగుతారు. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలతోపాటే అంతరపంటలుగా చిరుధాన్యాలు, కూరగాయలు పండించుకుంటే చిన్న రైతులకు తిండి కరువుండదు. ఈ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. - ఎన్. మన్మోహన్రెడ్డి (85001 47354), చించోలిబీ, సారంగపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా దిగుబడి తగ్గి.. తెగుళ్లు పెరుగుతున్నాయి! మా గ్రామాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే దత్తత తీసుకుంది. అన్ని పొలాల్లోనూ డ్రిప్ ఏర్పాటు చేసుకొని కూరగాయలే పండిస్తున్నాం. ఎకరానికి 7 టన్నులు కోళ్ల పెంట, డీఏపీ తదితర ఎరువులు వేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతోంది. తెగుళ్లు పెరుగుతున్నాయి. క్యాబేజీ 2010 వరకు ఎకరానికి 20 టన్నులు పండేది. ఇప్పుడు 5-6 టన్నులకు తగ్గింది. ఎండుతెగులుకు శాస్త్రవేత్తలూ పరిష్కారం చూపలేకపోతున్నారు. క్యారెట్ మొక్కలు 4 ఆకులు వేసిన తర్వాత పడిపోయి చనిపోతున్నాయి. టమాటా సాగులో మల్లి సమస్యకు పరిష్కారం లేదు. స్థానిక అధికారులకు ఈ సమస్యలపై అవగాహన శూన్యం. సమస్య ఇదీ అని చెప్పినా రోజులు గడుస్తున్నా పరిష్కారం ఏమిటో చెప్పే నాథుడే లేడు. ఫోన్ ద్వారా ఫొటో పంపితే ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం చూపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతకన్నా ఆలస్యమైతే పంట చేయిదాటిపోతుంది. పురుగుమందుల కంపెనీల శాస్త్రవేత్తలు తరచూ పొలాల్లోకి వస్తూనే ఉంటారు. తమ కంపెనీ ఉత్పత్తులనే వాడాలని ఎవరికి వారు ఊదరగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. యాంత్రీకరణలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కర్ణాటకలో క్యారెట్ సీడ్ వేయడం, దుంపలు పీకడం, కడగడం వంటి పనులన్నీ యంత్రాలతోనే చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. అటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి. ఖర్చు, తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగే సాగు పద్ధతులపై శిక్షణ కావాలి. - యువ రైతులు దేవేందర్‌రెడ్డి, శంకర్, సుఖేష్‌రెడ్డి, దీపక్‌రెడ్డి(98669 66162) చనువల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా - సేకరణ: పంతంగి రాంబాబు, ఫొటోలు: మోహన్