పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్‌ గార్డెన్స్‌!

Rio de janeiro Municipal Government Creating Urban Gardens For Income Communities - Sakshi

మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్‌) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా!  

సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు  రియో నగర మేయర్‌ ఎడ్వర్డో పేస్‌.

తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన  విభాగం.

పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 

2006లో ప్రారంభమైన ఈ అర్బన్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్ట్‌ ‘హోర్టాస్‌ కారియోకాస్‌’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి.

గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు.

ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్‌ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్‌ కమ్యూనిటీ కిచెన్‌ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్‌ ఏకంగా 15 ఫుట్‌ బాల్‌ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! 

ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్‌ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్‌ బారోస్‌. ‘హోర్టాస్‌ కారియోకాస్‌’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్‌ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్‌ గార్డెనింగ్‌ డైరెక్టర్‌ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్‌ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు.

నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్‌ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్‌ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని  పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు.

మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్‌ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్‌ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్‌ అంటారు. 
– పంతంగి రాంబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top