Organic agriculture
-
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
ప్రయోగాత్మకంగా.. నీటి పంటను 'షెల్ఫ్'లో పండిద్దాం!
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే. మట్టిలేని పంట.. అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు. వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు. ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు. అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు. ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు! -
‘సేంద్రియా’నికి నూతనోత్సాహం
(సాక్షి సాగుబడి డెస్్క) ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పంటల విస్తీర్ణం 2021తో పోలిస్తే 2022 నాటికి సగటున 26.6% (2.03 కోట్ల హెక్టార్లు) పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో 77.8%, గ్రీస్‌లో 73%, ఆ్రస్టేలియాలో 48% సేంద్రియ సాగు పెరిగిందని పేర్కొంది. అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ 2000 సంవత్సరంలో 15.1 బిలియన్ యూరోలుండగా 2022 నాటికి దాదాపు 135 బిలియన్ యూరోల (రూ. 12.13 లక్షల కోట్ల)కు పెరిగిందని... రిటైల్ అమ్మకాల్లో అమెరికా 56.6 బిలియన్ యూరోలతో అగ్రగామి మార్కెట్‌గా కొనసాగగా జర్మనీ, చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించింది. ఈ మేరకు 188 దేశాల నుంచి సేకరించిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ గణాంకాలతో కూడిన తాజా వార్షిక నివేదిక ‘ది వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్–2024’ను స్విట్జర్లాండ్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎఫ్ఐబీఎల్, ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ విడుదల చేశాయి. గత 25 ఏళ్లుగా ఏటా ప్రపంచ సేంద్రియ వ్యవసాయ గణాంకాలను ఈ సంస్థలు ప్రచురిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఫస్ట్, ఇండియా సెకండ్.. ♦ ఈ నివేదిక ప్రకారం 2022 చివరికి ప్రపంచవ్యాప్తంగా 9.64 కోట్ల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. 2021తో పోలిస్తే ఇది 26.6 శాతం లేదా 2.03 కోట్ల హెక్టార్లు ఎక్కువ. ♦ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం 2022లో 2 కోట్ల హెక్టార్లకుపైగా పెరిగింది. 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రియ సాగు విసీర్ణంతో ఆ్రస్టేలియా అత్యధిక విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. 2022లో 48.6% వృద్ధిని సాధించింది. ♦ 47 లక్షల హెక్టార్ల సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణంతో భారత్ రెండో స్థానంలో ఉంది. 2022లో సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణం ఏకంగా 78% పెరిగింది. ♦ ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సంఖ్య 1999లో 2 లక్షలు ఉండగా 2022 నాటికి 45 లక్షలకు పెరిగింది. 2021లోకన్నా ఇది 26 శాతం ఎక్కువ. భారత్ అత్యధిక సంఖ్యలో 25 లక్షల మంది రైతులు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. ♦ సేంద్రియ సాగు ప్రాంతం సగానికిపైగా ఓషియానియా (5.32 కోట్ల హెక్టార్లు) దేశాల్లోనే కేంద్రీకృతమైంది. 22 దేశాల్లోని వ్యవసాయ భూమిలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ సాగు జరుగుతోంది. అయినా మొత్తం సాగు భూమిలో ఇప్పటికి సేంద్రియ సాగు వైపు మళ్లింది 2% మాత్రమే. సేంద్రియ సేద్య ప్రోత్సాహక కార్యాచరణ ప్రణాళికలతో కూడిన ప్రత్యేక చట్టాలు 2023 నాటికి 75 దేశాల్లో అమల్లోకి వచ్చాయి. -
సహకార ‘భారత్ ఆర్గానిక్స్’!
సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్’ బ్రాండ్ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్ నెట్వర్క్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ గురించి కథనం.. సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. రూ.500 కోట్ల అథీకృత మూలధనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. దక్షిణాది తొలి సభ్యత్వం ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్ రిజిస్ట్రార్ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్ఆర్ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం. అతిపెద్ద బ్రాండ్ కానున్న ‘భారత్ ఆర్గానిక్స్’ రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌గా ‘భారత్ ఆర్గానిక్స్’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్) ఆవిర్భావంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్ నెలకొల్పనుంది. అమూల్ ఆర్గానిక్స్ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్ డెయిరీ, అమూల్ రిటైల్ ఔట్లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, మాక్స్ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. – బొడ్డు ప్రభాకర్ (97714 63539), మార్కెటింగ్ హెడ్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. prabhakar@ryss.ap.gov. త్వరలో ఆన్లైన్ విక్రయాలు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. – కోదండపాణి, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్), న్యూఢిల్లీ. cooporganics@gmail.com వినియోగదారుల సందేహాలకు తావుండదు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్ ద్వారా ‘భారత్ ఆర్గానిక్స్’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్ఆర్ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం. ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. – పి. గంగరాజు (63018 76177), సీఈఓ, ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్ఆర్ జిల్లా – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!
పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు. ప్రభుత్వ సీనియర్ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది. వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ. నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్‌ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్‌ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్‌గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్ అనే యంత్రాన్ని ఉపయోగించడం. ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్‌లైన్ నెట్వర్క్ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్ స్థలానికి తీసుకెళ్లారు. ప్రతాప్ సింగ్ ౖకైరోన్(పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్ఎస్ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్‌లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న. టి.కె. అరుణ్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం
సాక్షి, అమరావతి: దేశ ంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం కొనసాగుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో పీకేవీవై కింద అత్యధికంగా 2.06 లక్షల హెక్టార్లలో 2.65 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని తాజాగా వెల్లడించింది. పీకేవీవై కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.317.21 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత పీకేవీవై కింద అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతు.. ఈ పథకం కింద రైతులకు ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతును అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ విధానం ద్వారా మార్కెటింగ్ కోసం అవసరమైన శిక్షణ ఇచ్చి రైతుల్లో సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రాసెసింగ్‌తో పాటు పంట కోత అనంతరం ఉత్పత్తుల నిర్వహణ, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వివరించింది. క్లస్టర్ విధానంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. పీకేవీవై కింద సేంద్రీయ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.50 వేలు అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో ఆర్గానిక్ ఇన్‌ఫుట్‌ల కోసం రూ.31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వివరించింది. అలాగే మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువ జోడింపునకు రూ.8,800, సర్టిఫికేషన్‌కు రూ.2,700, అవసరమైన శిక్షణ, సామర్థ్యం పెంచేందుకు రూ.7,500 సాయం అందించనున్నట్లు తెలిపింది. సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి పలు చర్యలను చేపట్టామని పేర్కొంది. యూరియా అధిక వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
క్రమక్రమంగా పెరుగుతున్న సేంద్రియ రైతుల సంఖ్య...!
-
ఆర్గానిక్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తే లాభం..!
-
క్రమంగా సేంద్రియ సాగువైపు మళ్లుతున్న రైతులు
-
ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తే చీడపీడల బెడద కూడా తక్కువే
-
బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగుతో అధిక దిగుబడిని పొందిన రైతు
-
క్రమంగా సేంద్రియ సాగుబాట పడుతున్న రైతన్నలు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
సేంద్రియ వ్యవసాయంతో రైతుకు కలుగుతున్న లాభాలు
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
రైతులకు అందుబాటులో దేశీయ విత్తనాలు
-
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
పైసా పెట్టుబడి లేదు సేంద్రియ పద్దతుల్లో ఇంట్లోనే కూరగాయల సాగు...