Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం

Buttaigudem: Awareness Among Tribal Farmers on Nature Farming - Sakshi

పకృతి సాగుపై గిరిజన రైతుల్లో చైతన్యం

మన్యంలో 9,400 ఎకరాల్లో సాగు

ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ అధికారులు  

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. 

గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు.  


ప్రోత్సాహం ఇలా..  

గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లను, ఒక క్లస్టర్‌ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్‌పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. 

క్లస్టర్‌ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్‌ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 


200 ఎకరాల్లో కూరగాయలు.. 

సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు.  
2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 

2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు
జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.  

7 వేల ఎకరాల్లో వరి
ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. 


విస్తరిస్తున్న సేంద్రియ సాగు  

ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతు­లు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. 
– పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్‌ఎఫ్‌ డీపీఎం, ఏలూరు 
 
ప్రోత్సహిస్తున్నాం 
ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పా­ట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. 
– వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్‌ డివిజనల్‌ యాంకర్, కేఆర్‌పురం 
 
లాభదాయకంగా ఉంది 
ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. 
– సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top