సీనియర్స్ వేధింపులు భరించలేక ఘర్షణ
ర్యాగింగ్తో రోడ్డుపైకి జూనియర్ విద్యార్థులు
సాక్షి,ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశా లలో ర్యాగింగ్ భూతం జడలువిప్పుతోంది. మెడికల్ కాలేజీ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనతతో 3వ ఏడాది వైద్య విద్యార్థులు రెచ్చిపోతున్నారని, తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ 2వ ఏడాది వైద్య విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి సీనియర్స్, జూనియర్స్ మధ్య ఘర్షణ నెలకొంది. జూనియర్ వైద్య విద్యార్థులు ఏలూరు నగరంలో రోడ్డుపైకి వచ్చి అర్ధరాత్రి వేళ ఆందోళనకు దిగారు. వైద్య కళాశాల హాస్టల్ వార్డెన్ సైతం పట్టించుకోకపోవటంతోనే పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతుందని విద్యా ర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది. వెంటనే సీఐ అశోక్ కుమార్ సిబ్బందితో ఏలూరు జీజీహెచ్ లోని హాస్టల్కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
హాస్టల్‌లో జనియర్స్‌కు భద్రత కరువు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందని, తమను దారుణంగా వేధిస్తున్నా రంటూ జూనియర్స్ హాస్టల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని, తమను చెప్పుకోలేని స్థితిలో సీనియర్స్ ర్యాగింగ్కు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 మంది సీనియర్స్ తమపై దాడి చేశారంటూ పోలీసులకు తెలిపారు. హాస్టల్ అధికారులకు చెబితే మెడిసిన్లో ఇవన్నీ మామూలేనని, తీవ్ర నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. తమకు హాస్టల్లో భద్రత లేదంటూ జూనియర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జీజీహెచ్ ప్రాంగణం లోని హాస్టల్ వద్ద సీఐ అశోక్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


