సెలవుల మధ్యే సర్వీస్‌.. కానీ పవర్‌ ఫుల్ పోస్టులు! | Junior Women Officers Get Key Posts Sideline Seniors | Sakshi
Sakshi News home page

సెలవుల మధ్యే సర్వీస్‌.. కానీ పవర్‌ ఫుల్ పోస్టులు!

Mar 2 2026 1:08 PM | Updated on Mar 2 2026 1:27 PM

Junior Women Officers Get Key Posts Sideline Seniors

జిల్లాలో కీలకమైన రెండు శాఖలకు కీలక అధికారిగా ఓ జూనియర్‌ ఎంపీడీఓను నియమించారు. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని ఒక జూనియర్‌ అయిన మహిళా అధికారికి జిల్లాస్థాయి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్‌ అధికారులను నియమించకుండా ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తుండటం దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

అనంతపురం టౌన్‌: పేదరిక నిర్మూలన, గ్రామీణ ఉపాధి కల్పనతోపాటు గ్రామీణాభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతంలో కీలక పాత్ర పోషించే డీఆర్‌డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ)కు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా ఈ శాఖకు రెగ్యులర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ) లేరు. జిల్లాలో సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్లు, అత్యంత సీనియర్‌ ఎంపీడీఓలు చాలామంది ఉన్నారు. అయినా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో ఏపీసీగా పని చేస్తున్న అధికారిణికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు.  

ఇదీ.. ఆ అధికారి ఉద్యోగ ప్రస్థానం.. 
సీనియర్లను కాదని జిల్లాస్థాయి రెండు కీలక అధికారిక బాధ్యతలు దక్కించుకున్న జూనియర్‌ మహిళా అధికారిణి ఉద్యోగ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే.. 2018లో ఉమ్మడి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓగా నియమితులయ్యారు. నెలరోజుల అనంతరం సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ 2019 జనవరిలో విధుల్లోకి చేరారు. అలా ముచ్చటగా నెల రోజులు పనిచేయగానే మళ్లీ సెలవు పెట్టేశారు. 2021లో జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తి చేసుకున్నారు. 

నిబంధనలు జాన్తా నై..  
గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సదరు అధికారిణి కూడా చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అలా బదిలీ అయిన వారందరూ ఎన్నికల అనంతరం జిల్లాకు వచ్చి జిల్లా పరిషత్‌లో రిపోర్టు చేసుకొని.. అక్కడి నుంచి పోస్టింగ్‌ తెచ్చుకోవాలి. అయితే రాష్ట్రంలో అత్యంత జూనియర్‌ ఎంపీడీఓ అయిన ఆ మహిళా అధికారిణికి ఆ నిబంధనలేవీ వర్తించలేదు. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రావడం, ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో చిత్తూరు నుంచి వచ్చిన ఆమె మాతృ శాఖ అయిన జిల్లా పరిషత్‌ కార్యాలయంలో రిపోర్టు చేసుకోకుండా.. నేరుగా డ్వామాలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు    స్వీకరించారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే    అంటే 2025 జనవరిలో అనంతపురం సమగ్రశిక్ష ఏపీసీగా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. మరో కీలక శాఖ అయిన డీఆర్‌డీఏ ఇన్‌చార్జ్‌ పీడీగానూ కొనసాగుతున్నారు. 

భగ్గుమంటున్న సీనియర్లు.. 
మూడేళ్ల కిందట ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తి చేసుకున్న జూనియర్‌ మహిళా అధికారిణికి రెండు జిల్లాస్థాయి పోస్టులు కట్టబెట్టడంపై సీనియర్‌ ఎంపీడీఓలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ అండదండలు ఉంటే నిబంధనలు పాటించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అర్హులైన సీనియర్లను విస్మరించి జూనియర్‌కు పట్టం కట్టడం సముచితం కాదని అంటున్నారు. అడ్డగోలుగా దక్కిన కీలక పోస్టులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సీనియర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement