మిల్క్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

మిల్క్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం..

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

మిల్క

మిల్క్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం..

అనంతపురం అగ్రికల్చర్‌: పాల కల్తీ ప్రాణాలు హరిస్తోంది. ఇది వరకు పాలల్లో నీళ్లు మాత్రమే కలిపేవారు. ఇప్పుడు కొందరు అత్యాశకు పోయి నీళ్లతో పాటు రంగు, రుచి, చిక్కదనం కోసం యూరియా, ఫార్మలిన్‌, హైడ్రోజెన్‌ పెరాకై ్సడ్‌, మాల్డోడెక్స్‌ట్రిన్‌, డిటర్జెంట్స్‌ లాంటి రకరకాల ప్రమాదకర రసాయనాలు, హానికరమైన పదార్థాలు కలిపి పాల అమ్మకాలు చేస్తున్నారు. ఇలాంటి పాల కల్తీ దందా గుట్టును ఏడాది కిందటే జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రట్టు చేసిన విషయం తెలిసిందే. పాలలో హానికరమైన ‘మాల్డోడెక్స్‌ట్రిన్‌’ కలుపుతున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించి అప్రమత్తం చేశారు. తాజాగా రాజమండ్రిలో కల్తీపాలు తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది.

పాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, కల్తీ, నాసిరకం అనే అంశాలు తమకు సంబంధం లేదన్నట్లుగా పశు సంవర్ధక శాఖ అధికారులు మౌనం పాటిస్తున్నారు. పశువైద్యం, పశుసంతతి పెంపు, పథకాల అమలు వరకే తమ పని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం జిల్లాలో రోజుకు ఎన్ని లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది, అందులో ప్రైవేట్‌ డెయిరీలు ఎన్ని సేకరిస్తున్నాయి, బయట వ్యాపారులు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు, ఇతరత్రా రూపాల్లో సాగిస్తున్న అమ్మకాల వివరాలు చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారు. రోజుకు 5 లక్షల లీటర్లు అని ఒక అధికారి, లేదు లేదు 8 నుంచి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి అంటూ మరో అధికారి, అదీ కాదు... 13 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోందని ఇంకో అధికారి... ఇలా కచ్చితమైన లెక్క చెప్పే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం, కల్తీపాలను అరికట్టాలనే ఆలోచనతో 2023లో అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాల రక్షిత ప్రమాణాల అమలు చట్టం (మిల్క్‌యాక్ట్‌)ను తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ డెయిరీలు, ఇతరత్రా పాల సేకరణ, అమ్మకాలు సాగించే దుకాణాలు, ప్రాంతాల్లో పాల నాణ్యత తెలుసుకునే అధికారం పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించారు. జిల్లాలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్స్‌ సర్జన్స్‌ (వీఏఎస్‌) అందరూ ‘మిల్క్‌ ఇన్‌స్పెక్టర్లు’గా పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మిల్క్‌యాక్ట్‌పై శిక్షణ కూడా ఇచ్చారు. మిల్క్‌ యాక్ట్‌ ప్రకారం పాల సేకరణ కేంద్రాలు (మిల్క్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు) తప్పనిసరిగా రూ.1,500 చెల్లించి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏటా రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తనిఖీకి వచ్చినప్పుడు లైసెన్సు లేకుంటే మొదటి దఫా కింద రూ.50 వేల జరిమానా, రెండోసారి కూడా పట్టుబడితే రూ. లక్ష జరిమానా, ఆరు నెలల వరకు జైలుశిక్ష కూడా ఉంటుంది. కల్తీ, నాసిరకమని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

పాలు మంచి పోషక పదార్థం. అందుకే పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఆరోగ్యపరంగా పాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతుంటారు. కానీ.. మార్కెట్‌లో నాణ్యమైన స్వచ్ఛమైన పాలు లభించడం గగనమవుతోంది. వ్యాపారమే పరమావధిగా చేసుకుని పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజార్యోగం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మిల్క్‌ ఇన్‌స్పెక్టర్లు తరచూ పాల సేకరణ కేంద్రాలను తనిఖీ చేయాలి. పాల నాణ్యత పెంచి.. నాసిరకం, కల్తీని నివారించాలని మిల్క్‌యాక్ట్‌ చెబుతోంది. కానీ మిల్క్‌ ఇన్‌స్పెక్టర్లు తమ బాధ్యతల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ‘కల్తీ’ నిరాటంకంగా కొనసాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరం, పట్టణాలే కాదు.. ఇప్పుడు మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా ‘కల్తీ’ యథేచ్ఛగా సాగిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప నాణ్యమైన పాలు, వాటి ఉత్పత్తులు ప్రజలకు అందే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలు మాత్రమే కల్తీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పాల ద్వారా తయారయ్యే పెరుగు, మజ్జిగ, పాలపొడి, వెన్న, నెయ్యి, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌, పన్నీర్‌, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులు కూడా కల్తీ అయినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణసమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, పేగుల వాపు, గ్యాస్ట్రిక్‌, విరేచనాలు తదితర ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.

రాజమండ్రి ఘటనతో

పాల కల్తీపై సర్వత్రా ఆందోళన

ఏడాది కిందట జిల్లాలో పాలకల్తీ గుట్టురట్టు చేసిన ‘విజిలెన్స్‌’

మిల్క్‌ యాక్ట్‌ ఉన్నా పట్టించుకోని పశుశాఖ మిల్క్‌ ఇన్‌స్పెక్టర్లు

పశు శాఖ అధికారుల నిర్లక్ష్యం..

మిల్క్‌ యాక్ట్‌ ఏం చెబుతోందంటే..

మిల్క్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం.. 
1
1/1

మిల్క్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement