దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు | - | Sakshi
Sakshi News home page

దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

దుబాయ

దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు

కళ్యాణదుర్గం: విధి నిర్వహణలో ప్రతిభ కనబరచి విదేశీ పర్యటనకు వెళ్లిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకులు యుద్ధ వాతావరణం నేపథ్యంలో దుబాయిలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారంతా ఓ లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఐఐఎఫ్‌ఎల్‌ గోల్డ్‌ లోన్‌ సంస్థలో బాగా పనిచేసిన ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మందిని విదేశీ పర్యటనకు ఎంపిక చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన కురబ ఎర్రిస్వామి, ఒంటిమిద్దికి చెందిన తలారి రామాంజినేయులు, కంబదూరు మండలం రాంపురానికి చెందిన చిన్నయ్యకు అవకాశం లభించింది. వీరు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి 11 గంటలకు దుబాయి నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ సమయంలో విమానశ్రయంపై దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇజ్రాయెల్‌– ఇరాన్‌– అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం అందండంతో వారు బుర్జ్‌ ఖలిఫా సమీపంలోని ఒక లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు ఆదివారం కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. అయితే ఎయిర్‌ పోర్టు నుంచి లాడ్జికి చేరుకున్న వెంటనే దుబాయి విమానశ్రయంపై దాడులు జరగడం గమనార్హం. ‘ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాం. కానీ నిమిషానికో రకంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం’ అని బోరంపల్లికి చెందిన కురబ ఎర్రిస్వామి ‘సాక్షి’తో ఫోన్లో తెలిపారు.

కంట్రోల్‌ రూముల ఏర్పాటు..

అనంతపురం అర్బన్‌: ఇరాన్‌– ఇజ్రాయెల్‌ యుద్ధ నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదివారం వెల్లడించారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, తదితర దేశాల్లో చిక్కుకున్న వారి సమాచారం, సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము నంబర్లకు వారి బంధువులు ఫోన్‌ ద్వారా సంప్రదించాలని సూచించారు.

లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం

దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు 1
1/1

దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement