'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.
స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.
సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్‌లో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.
అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు.


